శ్రీలంక ప్రజా ఉద్యమంతో అట్టుడుకుతోంది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని శనివారం పెద్ద ఎత్తున రాజధాని కొలంబోలో ప్రజలు ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రజా ఉద్యమంతో అధ్యక్షభవనం నుంచి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పారిపోయారు. అధ్యక్ష భవనాన్ని, ఆయన కార్యాలయాన్ని ఆందోళకారులు ఆక్రమించారు. గొటబాయ రాజీనామా చేసేవరకు అధ్యక్ష భవనాన్ని విడిచి వెళ్తేది లేదంటూ వేలాదిగా నిరసనకారులు అక్కడే మకాం వేశారు.
ఇదిలా ఉంటే శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స జూలై 13న బుధవారం రోజున రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రధాని రణిల్ విక్రమ సింఘేకు తెలియజేసినట్లు ప్రధాని కార్యాలయం సోమవారం తెలిపింది. అంతకుముందు తన రాజీనామా విషయాన్ని స్పీకర్ మహింద యాపా అబేవర్దనకు తెలియజేశాడు గొటబాయ ఇప్పటికే ప్రధాని రణిల్ విక్రమ సింఘే తన పదవికి రాజీనామా చేశారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీలంకలో అవినీతికి రాజపక్స సోదరులే కారణం అని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. వీరి అవినీతి కారణంగానే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తెలెత్తిందని.. అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేయాలంటూ మార్చి నుంచి శ్రీలంకలో ఉద్యమం నడుస్తోంది.
Rad Also: Supreme Court: విజయ్ మాల్యాకు బిగ్ షాక్.. కోర్టు ధిక్కార కేసులో నాలుగు నెలల జైలుశిక్ష
మే నెలలో ప్రధానిగా ఉన్న మహిందా రాజపక్స తన ప్రధాని పదవికి రాజీనామా చేశాడు. అయితే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాత్రం రాజీనామాకు ససేమిరా అన్నాడు. కొత్తగా రణిల్ విక్రమసింఘేను ప్రధానిగా నియమించారు. తాజాగా ప్రజా ఉద్యమంతో గోటబయ మెడలు వంచారు ప్రజలు. ఇప్పటికే గోటబయ రాజపక్స దేశం దాటి వెళ్లాడనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే అఖిల పక్షం ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని పార్టీలు సుముఖత వ్యక్తం చేశాయి. గొటబాయ రాజీనామా తర్వాత శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాని ఎవరనేదానిపై చర్చిస్తున్నారు.
బ్రిటన్ నుంచి 1948లో స్వాతంత్య్రం పొందిన తర్వాత శ్రీలంక ఎన్నడూ ఇలాంటి ఆర్థిక సమస్యలను ఎదుర్కోలేదు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అప్పులు కలిసి తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారి తీశాయి. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో పాటు దేశంలో పెట్రోల్, డిజిల్ దొరకని పరిస్థితి ఏర్పడింది. రోజుల తరబడి ప్రజలు బంకుల ముందు క్యూల్లో ఉన్నా పెట్రోల్ దొరకడం లేదు. దీంతో ప్రజల్లో అసహనం పెరిగి తీవ్ర ఉద్యమానికి దారి తీసింది.