Sri Lanka To Raise Electricity Rates: శ్రీలంక ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఇప్పటికే కరెంట్ కోతలతో అల్లాడుతున్న జనానికి మరో షాక్ ఇచ్చింది శ్రీలంక ఎలక్ట్రిసిటీ బోర్డ్(సీఈబీ). తన నష్టాలను పూడ్చుకునేందుకు ప్రజలపై భారాన్ని మోపింది. ఏకంగా 264 శాతం ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు మరింత భారాన్ని మోయాల్సిన పరస్థితి ఏర్పడింది. 616 మిలియన్ డాలర్ల మేర పేరుకుపోయిన బకాయిల నుంచి బయటపడేందుకు సీఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తన నష్టాలను అధిగమించాలంటే 800 శాతం మేర ధరలను పెంచాలని ప్రతిపాదిస్తే.. ప్రభుత్వం మాత్రం 264 శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది.
శ్రీలంక నిర్ణయం వల్ల 90 కిలోవాట్ల కన్నా తక్కువగా వాడుతున్న 7.8 మిలియన్ కుటుంబాలపై ప్రభావం పడుబోతోంది. ప్రస్తుతం యూనిట్ కు 2.50 రూపాయలు కడుతున్న చిన్న వినియోగదారుడు ఇక మీదట రూ. 8 చెల్లించాల్సి వస్తుంది. ఇక పెద్ద వినియోగదారుడు ఒక్కో యూనిట్ కు రూ.75 రూపాయలు చెల్లించాలి. గతంలో ఇది రూ. 45గా మాత్రమే ఉండేది. శ్రీలంక ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. గడిచిన 9 ఏళ్లలో తొలిసారిగా సీఈబీ కరెంట్ ఛార్జీలను పెంచింది.
Read Also: Professor Bikini: బికినీ ధరించింది.. ఉద్యోగం ఊడింది.. ఆపై రూ. 99 కోట్లు..
ఇంధనం, విద్యుత్, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక.. ఇతర దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులు చేసుకునేందుకు కూడా విదేశీ మారక నిల్వలు లేకుండా అల్లాడుతోంది. శ్రీలంక ఎక్కవగా విద్యుత్ వినియోగం కోసం థర్మల్ జనరేటర్లను వాడుతోంది. వీటన్నింటికి చమురు చాలా అవసరం అయితే.. శ్రీలంక మాత్రం తగినంత చమురును దిగుమతి చేసుకునే అవకాశం లేదు. దీంతో శ్రీలంక తీవ్ర కరెంట్ కోతలతో సతమతం అవుతోంది. 51 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలను చెల్లించలేక బెయిలౌట్ కోసం ఐఎంఎఫ్ తో చర్చలు జరుపుతోంది.
