తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. గొటబాయ రాజపక్స ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని కొలంబోలోని అధ్యక్ష కార్యాలయం ముందు భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడి నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మంగళవారం హింసాత్మకంగా మారాయి. శ్రీలంక నైరుతి ప్రాంతమైన రాంబుక్కనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంధన ధరలు పెరగడాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని అడ్డుకొనేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో… ఒకరు మృతిచెందగా.. దాదాపు 24 మంది గాయపడ్డారు.
Read Also: BJP: ఆ ఆత్మహత్యలపై సీబీఐ విచారణ జరిపించాలి.. గవర్నర్‌కు బీజేపీ వినతి
అయితే, నిరసనకారులు రాంబుక్కనలో రైల్వే ట్రాక్‌ను బ్లాక్ చేశారనీ.. తమపై రాళ్లు రువ్వారని పోలీసులు ఆరోపించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకే కాల్పులు జరిపామని వివరణ ఇచ్చారు. ఈ ఘటనలో 8మంది పోలీసులకు కూడా గాయాలయ్యాయని తెలిపారు. శ్రీలంకలో ఇంధన ధరలూ భగ్గుమంటున్నాయి. ద్వీప దేశంలో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం శ్రీలంక 338 రూపాయలకు చేరింది. అక్కడి చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ పెట్రోల్ రేట్లను పెంచిన మరుసటి రోజే.. దానికి అనుగుణంగా శ్రీలంక ప్రభుత్వ చమురు సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ కూడా ధరలను పెంచేసింది. ఇప్పటికే ఇంధన, ఆహార కొరతతో అల్లాడుతున్న శ్రీలంక ప్రజలకు తాజాగా పెంచిన ధరలు గోరుచుట్టుపై రోకలిపోటులా మారాయి. మరోవైపు, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు శ్రీలంక ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. అమెరికా పర్యటనలో ఉన్న శ్రీలంక ఆర్థిక మంత్రి అలీ సబ్రే … ఐఎంఫ్ సాయాన్ని కోరారు. ఇందుకు ఐఎంఎఫ్ సానుకూలంగా స్పందించారు. మరోవైపు భారత ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ … శ్రీలంక ఆర్థిక మంత్రితో సమావేశమయ్యారు. పొరుగదేశంగా వీలైనంత సాయం చేస్తామని, ఆర్థిక సంక్షోభ సమయంలో అడంగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
