Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!

  • శ్రీలంకలో శనివారం మధ్యాహ్నం దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయం
  • మూడు గంటలకు పైగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
  • నీటి సరఫరా, ఇంటర్నెట్, మొబైల్ నెట్‌వర్క్‌లపై ప్రభావం
Sri Lanka

Sri Lanka

Sri Lanka: శ్రీలంకలో శనివారం భారీ విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా అకస్మాత్తుగా నిలిచిపోయింది. శ్రీలంక వ్యాప్తంగా 3 గంటలకు పైగా విద్యుత్ అందుబాటులో లేదు. విద్యుత్ అంతరాయంతో నీటి సరఫరా, ఇంటర్నెట్, మొబైల్ కనెక్టివిటీ ప్రభావితమయ్యాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దశల వారీగా విద్యుత్‌ను పునరుద్ధరించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

శనివారం విద్యుత్ వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా దేశవ్యాప్తంగా అంతరాయం ఏర్పడినట్లు శ్రీలంక అధికారులు చెప్పారు. విద్యుత్ అంతరాయం కారణంగా శ్రీలంకలో నీటి సరఫరా నిలిచిపోయింది. నీటిని వృధా చేయవద్దని శ్రీలంక నీటి సరఫరా సంస్థ ప్రజల్ని కోరింది. ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయాయి.

సాంకేతిక కారణంగా విద్యుత్ నిలిచిపోయిందని ఆ దేశ ఇంధన శాఖ మంత్రి అనుసర కరుణతిలక తెలిపారు. అయితే, అంతరాయానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం.. దేశంలోని మధ్య పర్వత ప్రాంతంలో ఉన్న జల విద్యుత్ కేంద్రంలో ఏర్పడిన సాంకేతిక లోపమే ఈ అంతరాయానికి కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు, సోలార్ ప్యానెళ్లు కలిగినవారు వాటిని పవర్ గ్రిడ్ నుంచి డిస్ కనెక్ట్ చేయాలని కోరారు. విద్యుత్ వ్యవస్థ బాగుపడే వరకు ఈ చర్య తీసుకోవాలని సూచించారు.