NTV Telugu Site icon

Sri Lanka Crisis: రావణకాష్టంలా శ్రీలంక… ఆందోళనల్లో ఏడుగురు మృతి

Sri Lanka

Sri Lanka

తీవ్ర ఆర్థిక, ఆహారం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు విషమిస్తున్నాయి. ఆందోళనకారుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. శ్రీలంకలో నిన్నటి నుంచి జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 7 మంది మరణించారు. 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. 260 మందికి తీవ్రగాయాలు కాగా… ఐసీయూలో 60 మంది చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వారిలో ముగ్గురు టూరిస్టులు కూడా ఉన్నారు. ఇప్పటికే మహిందా రాజపక్సే తన ప్రధానికి రాజీనామా చేశారు. భద్రతా కారణాల వల్ల మహిందా రాజపక్సేను ఆర్మీ అధికారులు రహస్య ప్రాంతానికి తరలించారు. ఓ నావెల్ బేస్ లో రక్షణ పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తక్షణమే శ్రీలంక పార్లమెంట్ ను ఏర్పాటు చేయాలని స్పీకర్, అధ్యక్షుడు గొటబయ రాజపక్సేను కోరారు.

నిన్నటి నుంచి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రభుత్వ ఆర్మీ, పోలీసులకు షూట్  ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చింది. హింసాత్మక ఘటనలను అదుపులోకి తెచ్చేందుకు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. మరోవైపు ఆందోళనకారులను అదుపు చేసేందుకు పది మంది కరుడుగట్టిన ఖైదీలను రాజపక్సే సర్కార్ విడుదల చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో జనం రెచ్చిపోయి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వాహనాలకు నిప్పు పెడుతున్నారు. పోలీసులు, ఆర్మీ టియర్ గ్యాస్ వినియోగించినా… ప్రజలు వెనక్కి తగ్గడం లేదు. దేశంలో జరుగున్న హింసాత్మక ఘటనలను చూసి బౌద్ధగురువులు భరించలేకపోతున్నారు. ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. ఓ బౌద్ధ గురువు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడం అందర్ని కలిచివేసింది.

శ్రీలంక ఆర్థిక సంక్షోభం ప్రారంభం అయినప్పటి నుంచి ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు తెలియజేస్తున్నారు. నిత్యావసరాల ధరలు తీవ్రంగా పెరగడంతో పాటు గ్యాస్, పెట్రోల్ లభించని పరిస్థితులు ఏర్పడటంతో జనాల్లో అసహనం ఏర్పడింది. శ్రీలంక పరిస్థితికి అధ్యక్షుడు గోటబయ రాజపక్సే, ప్రధాని మహీందా రాజపక్సేల అవినీతే కారణం అంటూ ప్రజలు ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు  చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి.