NTV Telugu Site icon

SpaceX: ఎలాన్ మస్క్ “మెగా రాకెట్” ప్రయోగం.. రీ ఎంట్రీలో సిగ్నల్ లాస్ట్..

Spacex Starship

Spacex Starship

SpaceX: బిలియనీర్ ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ఎక్స్ స్టార్ షిప్ మెగా రాకెట్ చివరి దశలో విఫలమైనట్లు తెలుస్తోంది. చంద్రుడు, ఇతర ఇంటర్ ప్లానెటరీ మిషన్ల కోసం వ్యోమగాములను పంపడానికి ఉద్దేశించబడిన ఈ ప్రయోగం గురువారం జరిగింది. గతంతో పోలిస్తే ఈసారి స్టార్ షిప్ రాకెట్ ఎక్కువ దూరం, ఎక్కువ వేగాన్ని సాధించింది. అయితే రీ ఎంట్రీ సమయంలో భూమి వైపు తిరిగి వస్తుండగా అది సిగ్నల్‌ని కోల్పోయింది. స్పేస్‌క్రాఫ్ట్ హైపర్‌సోనిక్ వేగంతో భూవాతావరణంలోకి తిరిగి వస్తుండగా ఒకేసారి మిషన్ కంట్రోల్ రెండు శాటిలైట్ వ్యవస్థల నుంచి స్టార్ షిప్‌తో సంబంధాలు కోల్పోయిందని స్పేస్ఎక్స్ తెలిపింది.

టెక్సాస్‌లోని బోకా చికాలోని కంపెనీ స్టార్ బేస్ నుంచి మెగా రాకెట్ నింగిలోకి వెల్లింది. ఈ దశాబ్ధం చివరి నాటికి చంద్రుడిపై వ్యోమగాముల్ని ల్యాండ్ చేయడానికి నాసా ప్రణాళికల్లో ఈ రాకెట్ చాలా ముఖ్యమైంది. ఏదో రోజు మార్స్‌పైకి కూడా మానవులను తీసుకెళ్లానే ఎలాన్ మస్క్ కల ఈ రాకెట్ ద్వారా సాధించే అవకాశం ఉంది. గతంలో జరిగిన రెండు టెస్ట్ ఫ్లైట్లతో పోలిస్తే ఈ సారి రాకెట్ మరింత వేగంగా, మరింత దూరం ప్రయాణించింది. కానీ భూవాతావరణంలోకి వస్తుండగా సిగ్నల్ కోల్పోయింది. దీనికి కారణాలు ఏంటనే విషయం స్పష్టంగా తెలియలేదు. రీఎంట్రీ సమయంలో భూవాతావరణంలోకి రాగానే ఘర్షణ కారణంగా వేల డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీనిని రాకెట్ తట్టుకుని భూమి మీదకు రావాల్సి ఉంటుంది.

Read Also: WPL 2024: నేడు ముంబై, బెంగళూరు మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్.. ఢిల్లీని ‘ఢీ’ కొట్టేదెవరు?

స్టార్ షిప్ రెండు దశల్ని కలిపినప్పుడు దాని ఎత్తు స్టాచ్యు ఆఫ్ లిబర్టీ కంటే పెద్దగా 121 మీటర్ల పొడవు ఉంటుంది. దాని హెవీ బూస్టర్లు 16.7 మిలియన్ పౌండ్ల (74.3 మెగాన్యూటన్‌లు) థ్రస్ట్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ప్రపంచంలోనే రెండో అత్యంత శక్తివంతమైన రాకెట్. రాకెట్ గంటలకు 26,000 కిలోమీటర్ల వేగాన్ని సాధించింది, సముద్ర మట్టానికి 200 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లింది. ఆ తర్వాత హిందూ మహాసముద్రం మీదుగా భూమి వైపు అవరోహణ ప్రారంభించింది. అయితే, చివరి నిమిషాల్లో గ్రౌండ్ కంట్రోల్ సిగ్నల్స్ అందుకోవడం ఆగిపోయింది. బూస్టర్‌ని వాటర్ ల్యాండింగ్ చేయడంలో విఫలమైంది. దీనిపై విచారణ ప్రారంభించారు.

స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ తొలి టెస్ట్ ఫ్లైట్ ఏప్రిల్ 2023లో జరిగింది. నింగిలోకి ఎగిసిన కొన్ని నిమిషాల్లో సాంకేతిక సమస్యలతో రాకెట్‌ని పేల్చేయాల్సి వచ్చింది. నవంబర్ 2023లో జరిగి టెస్ట్ ఫ్లైట్ గతంలో దాని కన్నా మెరుగైన ఫలితాలను సాధించింది. ఆ సమయంలో కూడా ప్రయోగం విఫలమైంది. స్టార్ షిప్ నిర్మాణానికి 90 మిలియన్ డాలర్లను స్పేస్ఎక్స్ ఖర్చు చేస్తోంది. స్పేస్ఎక్స్ ఫాల్కన్ రాకెట్లు నాసా వాణిజ్యరంగానికి గెలుపు గుర్రాలుగా మారాయి. డ్రాగన్ క్యాప్సూల్స్ ద్వారా వ్యోమగాముల్ని, సరుకుల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) పంపుతోంది. 2026లో నాసా చంద్రుడిపైకి వ్యోమగాముల్ని పంపాలని అనుకుంటోంది. ఈ ప్రయోగానికి స్టార్ షిప్ చాలా కీలకం.