Site icon NTV Telugu

Covid-19: కరోనాకు ఆరేళ్లు.. సరిగ్గా ఇదే రోజు కోవిడ్ మహమ్మారి ఎంట్రీ..

Covid 19

Covid 19

Covid-19: ఆరేళ్ల క్రితం ఇదే రోజు అంటే, డిసెంబర్ 31, 2019 ప్రపంచమంతా ‘‘న్యూ ఇయర్’’ వేడుకలకు సిద్ధమవుతోంది. ప్రజలంతా కొత్త ఏడాదిని స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నారు. కానీ అదే సమయంలో ఒక మహమ్మారి పురుడుపోసుకుంది. అదే ‘‘కోవిడ్-19’’. మానవ చరిత్రలో ఆధునిక కాలంలో మనిషి ఎప్పుడూ చూడని ప్రళయాన్ని సృష్టించింది. ప్రజలందర్ని కేవలం ఇళ్లకే పరిమితం చేసింది. ‘‘లాక్‌డౌన్’’తో జనజీవితం అస్తవ్యస్తమైంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.

కరోనాకు కేంద్రంగా వూహాన్:

ఈ మొత్తం కరోనాకు చైనాలోని వూహాన్ నగరం కేంద్రంగా మారింది. చైనాలోని ఆరోగ్య నిపుణులు కొత్తగా నమోదైన కేసును మొదటగా ‘‘న్యూమోనియా’’గా భావించారు. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం, లక్షణాల తీవ్రంగా ఉండటంతో అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. ఇది నెమ్మదిగా చైనా నుంచి ప్రపంచంలోని మిగతా దేశాలకు వ్యాప్తించింది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థల్ని, ఆరోగ్య వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసింది.

వూహాన్‌లోని ఫిష్ మార్కెట్‌లో మొదటగా ఈ కోవిడ్-19 కేసుల్ని గుర్తించారు. ఇది మహాసముద్రాలు దాటి యూరప్, అమెరికా, ఆఫ్రికా, ఆసియాలోని ఇతర దేశాలకు చేరింది. 21వ శతాబ్దపు అత్యంత వినాశకరమైన మహమ్మారిగా మారింది. మార్చి 2020 నాటికి, వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్‌ను అరికట్టడానికి దేశాలు తమ సరిహద్దుల్ని మూసేశాయి. నగరాలను స్మశానాలను తలపించేలా ‘‘లాక్‌డౌన్’’ పరిస్థితిలోకి వెళ్లాయి. అధికారికంగా కోవిడ్-19 వల్ల ప్రపంచ వ్యాప్తంగా 7 మిలియన్ల మంది ప్రాణాలు వదిలారు. మహా మాంద్యంత తర్వాత ఎప్పుడూ చూడని విధంగా పలు దేశాలు ఆర్థిక వ్యవస్థలు కుచించుకుపోయాయి.

భారత్‌లో లాక్‌డౌన్:

కోవిడ్-19ను అరికట్టడానికి భారత్ మార్చి 2020లో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ముందుగానే వినాశనాన్ని గుర్తించిన కేంద్రం.. ఆస్పత్రులు, పరీక్షలు, ఆక్సిజన్ సరఫరా సప్లై చైన్‌ను బలోపేతం చేయడానికి సమయాన్ని సంపాదించుకుంది. కానీ, కోవిడ్-19 డెల్టా వేరియంట్ వారాల్లోనే లక్షలాది మందిని చంపింది. అయినప్పటికీ, భారత్ ఒక ఏడాది లోపే వ్యాక్సిన్‌ను తయారు చేసుకోగలిగింది.

భారత్ బయోటెక్ కోవాక్సిన్, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్‌ను భారీగా ఉత్పత్తి చేసింది. లక్షలాది మంది మరణాలను అడ్డుకునేందుకు సహాయపడ్డాయి. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆరేళ్ల క్రితం వూహాన్ నుంచి వచ్చిన ఈ కరోనా వైరస్, ప్రపంచ దేశాలకు ఆరోగ్య అత్యవసర స్థితికి ఎలా సన్నద్ధమవ్వాలో నేర్పించింది.

Exit mobile version