NTV Telugu Site icon

Israel-Hamas War: ఆరుగురు బందీలను తల వెనక కాల్చి చంపిన హమాస్: బెంజమిన్ నెతన్యాహూ..

Israel Hamas War

Israel Hamas War

Israel-Hamas War: గాజాలో బందీగా ఉన్న ఆరుగురు ఇజ్రాయిలీలను హమాస్ కాల్చి చంపడం యుద్ధంలో కీలక పరిణామంగా మారింది. గాజాలోని దక్షిణ ప్రాంతమైన రఫాలోని భూగర్భ సొరంగాల్లో ఈ ఆరుగురు మృతదేహాలను ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) కనుక్కున్నాయి. బందీలు చనిపోవడంపై ఇజ్రాయిల్‌‌లో తీవ్ర నిరసనలకు దారి తీశాయి. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ లక్ష్యంగా వేలాది మంది టెల్ అవీవ్‌లో నిరసనలు చేశారు. బందీల విడుదల ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే, బందీల తల వెనక భాగంలో కాల్చి హమాస్ హత్య చేసిందిన నెతన్యాహూ సోమవారం చెప్పారు. ‘‘ఆ హంతకులు మా బందీలలో ఆరుగురిని కాల్చి చంపారు’’ అని అన్నారు. బందీలను అత్యంత సమీపంలో నుంచి కాల్చి చంపినట్లు ఇజ్రాయిల్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. బందీలను రక్షించలేకపోయినందుకు ఇజ్రాయిల్ ప్రధాని ప్రజల్ని క్షమాపణ కోరారు. ఐక్యత కోసం పిలుపునిచ్చారు.

Read Also: Putin: అరెస్ట్ బెదిరింపులకు భయపడని పుతిన్.. మంగోలియాలో పర్యటన..

గతేడాది అక్టోబర్ 07 నాడు ఇజ్రాయిల్‌పై హమాస్ దారుణమైన దాడికి పాల్పడింది. ఈ దాడిలో 1200 మందిని ఊచకోత కోసింది. 240 మందికి పైగా ఇజ్రాయిలీ ప్రజల్ని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లింది. గతేడాది చివర్లో కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా 100 మంది వరకు బందీలను హమాస్ విడుదల చేసింది. ఒప్పందంలో భాగంగా తమ జైళ్లలో ఉన్న పలువురు పాలస్తీనియన్లను విడుదల చేసింది.

ఇదిలా ఉంటే హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకోవడంలో ఇజ్రాయిల్ ప్రధానిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆగ్రహంతో ఉన్నారు. హమాస్ కాల్చి చంపిన ఆరుగురు బందీల్లో ఒకరు అమెరికన్ ఇజ్రాయిలీ ఉన్నారు. మరోవైపు అమెరికా, ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్న చర్చల్లో గాజా-ఈజిప్ట్ సరిహద్దులోని ఫిలడెల్ఫి కారిడార్ కీలకంగా మారింది. ఇక్కడ నుంచి వైదొలగాలని హమాస్ కోరుతుంటే, ఈ ప్రాంతంపై తమ నియంత్రణ ఉండాలని నెతన్యాహూ పట్టుబడుతున్నారు. యుద్ధ లక్ష్యాల సాధన ఫిలడెల్పీ కారిడార్ గుండా వెళుతోందని నెతన్యాహూ చెప్పారు. తాను ఒత్తిడికి లొంగేది లేదని చెప్పారు. అక్టోబర్ 7 దాడిలో బందీలుగా 251 మందిలో 97 మంది ఇంకా గాజాలోనే ఉన్నారు. వీరిలో 33 మంది మరణించినట్లు ఇజ్రాయిల్ సైన్యం చెబుతోంది.

Show comments