Tallest Buildings: ఏ దేశంలో అయినా మహానగరాలు అనగానే అందరికీ ఎత్తైన భవనాలే గుర్తుకువస్తాయి. ఎందుకంటే మహానగరాలలో మాత్రమే అంతటి ఎత్తైన భవనాలను నిర్మించుకునేందుకు అధికారులు అనుమతి ఇస్తారు. మన దేశంలో ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి నగరాల్లో ఎత్తయిన భవనాలు కనిపిస్తాయి. అయితే విదేశాలలో ముఖ్యంగా దుబాయ్ లాంటి నగరాలల్లో ఎత్తయిన భవనాలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి. కానీ ప్రపంచంలో అత్యధిక ఎత్తయిన భవనాలు ఉన్న నగరం గురించి చాలా మందికి తెలియదు. 200 మీటర్లు అంతకన్నా ఎత్తున్న భవనాలు ఎక్కువగా ఉన్న నగరంగా చైనాలోని షెంజెన్ తొలిస్థానంలో నిలిచింది. 200 మీటర్లు అంటే దాదాపు 60 అంతస్తులు ఉంటాయి. అంటే 60 అంతస్తుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలు షెంజెన్‌లో దాదాపు 120 ఉన్నాయని ‘టాల్ బిల్డింగ్స్ అండ్ అర్బన్ హ్యాబిటాట్ కౌన్సిల్’ నివేదికలో వెల్లడైంది.
Read Also: Ease Of Doing Business: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణకు అవార్డు
ఈ జాబితాలో చైనాలోని షెంజెన్ తర్వాతి స్థానాల్లో దుబాయ్ ఉంది. దుబాయ్‌లో 200 మీటర్ల కంటే ఎత్తయిన భవనాలు 107 ఉన్నాయి. దుబాయ్‌లోనే ప్రపంచంలో అత్యంత ఎత్తు గల బుర్జ్ ఖలీఫా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రపంచంలో అత్యధిక ఎత్తు గల భవనాలు ఉన్న నగరాల జాబితాలో హాంకాంగ్ మూడో స్థానంలో ఉంది. హాంకాంగ్‌లో 94 భవనాలు ఉన్నాయి. న్యూయార్క్(92 భవనాలు), షాంఘై(60 భవనాలు), చైనాలోని చాంకింగ్(54 భవనాలు), కౌలాలంపూర్(51 భవనాలు) ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 23 ఎత్తయిన భవనాలతో మన దేశంలోని ముంబై 27వ స్థానంలో, కేవలం ఒకే ఒక భవనంతో కోల్‌కతా 199వ స్థానంలో నిలిచాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. షెంజెన్ నగరంలో 159 మీటర్లు అంతకన్నా ఎక్కువ ఎత్తున్న 162 భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇందులో ఓ 40 భవనాలను ఈ ఏడాదే ప్రారంభించనున్నారు. అంటే భవిష్యత్‌లో షెంజెన్ దరిదాపుల్లోకి కూడా ఏ నగరం వెళ్లే ప్రసక్తే లేదు.