యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని యూఏఈ అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. షేక్ ఖలీఫా అబుదాబి పాలకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. షేక్ ఖలీఫా మరణం పట్ల ప్రపంచ దేశాలు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నాయి. భారత ప్రధాని మోదీ కూడా తన సంతాపాన్ని ప్రకటించారు.
యూఏఈ రాజ్యాంగం ప్రకారం వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తూమ్, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వారకు ఫెడరల్ కౌన్సిల్ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. 30 రోజుల్లోపు ఈ ఎన్నిక జరుగనుంది.
1948లో జన్మించిన ఖలీఫా, 2014లో స్ట్రోక్ తో బాధపడుతున్నాడు. అప్పటి నుంచి చాలా అరుదుగా బయట కనిపించారు. అతని సవతి సోదరుడు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్ వాస్తవ పాలకుడిగా వ్యవహరిస్తున్నారు. షేక్ ఖలీఫా మరణంతో యూఏఈలో 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నారు. మూడు రోజుల పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.