Site icon NTV Telugu

Meloni: ట్రంప్ శాంతికర్త అంటూ షెహబాజ్ షరీఫ్ పొగడ్తలు.. మెలోని సంజ్ఞలు వైరల్

Meloni2

Meloni2

ఈజిప్టు వేదికగా గాజా శాంతి శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్ర నాయకులంతా హాజరయ్యారు. ట్రంప్ ప్రసంగించిన తర్వాత మాట్లాడాల్సిందిగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ఆహ్వానించారు. ఇక షరీఫ్ ప్రసంగం మొదలు పెట్టగానే ఆద్యంతం ట్రంప్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ట్రంప్ ప్రపంచ శాంతికర్త అంటూ ప్రశంసించారు. వెనుకనే ఉన్న ఇటలీ ప్రధాని మెలోని నోటిపై చేయి వేసుకుని ఆశ్చర్యపోయింది. చాలాసేపు వింతైన హావభావాలు వ్యక్తం చేశారు. భారతదేశం-పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపారని.. ఇప్పుడు గాజా-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపారని.. ఇలా ప్రపంచంలో అనేక యుద్ధాలని ఆపారంటూ షరీఫ్ ప్రసంగిస్తుండగా ఇటలీ ప్రధాని మెలోని మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ నిలబడిపోయారు. నోటిపై చేయి వేసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అలా ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: INDIA Bloc: ఆర్జేడీ-కాంగ్రెస్ సీట్ల పంపకాలు!.. ఎవరికెన్ని స్థానాలంటే..!

గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. సోమవారం ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేయగా.. ఇజ్రాయెల్ పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. ఈ సందర్భంగా ట్రంప్ ఇజ్రాయెల్‌కు వచ్చారు. అనంతరం ఈజిప్టు వేదికగా గాజా శాంతి ఒప్పందం జరిగింది. యుద్ధానంతరం గాజా అభివృద్ధిపై ఏం చేయాలన్నదానిపై చర్చించేందుకు ప్రపంచం వ్యాప్తంగా ఉన్న నేతలను ట్రంప్ ఆహ్వానించారు. ప్రధాని మోడీని ఆహ్వానించారు కానీ గైర్హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: Train Alert: రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఐదు రోజుల పాటు పలు ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్స్ రద్దు!

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై షరీఫ్ ప్రసంగిస్తుండగా పక్కనే ట్రంప్ నిలబడ్డారు. వెనుకనే ఇటలీ ప్రధాని మెలోని, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ నిలబడ్డారు. ఇక షరీఫ్ ప్రసంగం మొదలు పెడుతూ ట్రంప్‌‌ను ప్రపంచ శాంతికర్త అంటూ కీర్తించారు. వెంటనే మెలోని నోటిపై చేయి వేసుకుని ఆశ్చర్యంగా హావభావాలు వ్యక్తం చేశారు. ఆమె చేయి కిందకి దించిన తర్వాత కూడా ట్రంప్‌ను ప్రశంసిస్తూనే ఉండటంతో మెలోని అసౌకర్యంగా ఉన్నట్లు కనిపించారు.

మోడీపై ట్రంప్ ప్రశంసలు..
ప్రధాని మోడీని మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. అది కూడా ప్రపంచ అగ్ర నాయకులంతా ఒక చోట నిలబడి ఉండగా.. అంతేకాకుండా పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పక్కనే ఉండగా ఈ సంఘటన జరగడం విశేషం. ఈజిప్టులో గాజా శాంతి శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్ర నాయకులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ ప్రసంగిస్తూ.. ప్రధాని మోడీ తనకు చాలా మంచి స్నేహితుడు అంటూ ప్రశంసించారు. భారతదేశం-పాకిస్థాన్ చాలా చక్కగా కలిసి జీవిస్తాయని తాను భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. వెనుకనే ఉన్న షెహబాజ్ షరీఫ్‌ను చూసి ట్రంప్ మాట్లాడగానే అందరూ నవ్వులు.. పువ్వులు పూయించారు. భారతదేశం తమకు అగ్ర స్థానంలో ఉన్న మంచి స్నేహితుడిగా ఉన్న గొప్ప దేశం అని ట్రంప్ కొనియాడారు. మోడీ అద్భుతంగా పని చేస్తారని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అనంతరం సభలో ప్రసంగించాలని షెహబాజ్ షరీఫ్‌ను ట్రంప్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ.. ట్రంప్ అవిశ్రాంత ప్రయత్నాల కారణంగా పశ్చిమాసియాలో శాంతి నెలకొందని కొనియాడారు. భారతదేశం-పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపారని.. అందుకే ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినట్లు షరీష్ చెప్పుకొచ్చారు. దక్షిణాసియాలోనే కాకుండా పశ్చిమాసియాలో కూడా లక్షలాది మంది ప్రాణాలను కాపాడినందుకు ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి మళ్లీ నామినేట్ చేయాలనుకుంటున్నట్లు షరీఫ్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో యుద్ధాలను ట్రంప్ ఆపారని.. కచ్చితంగా నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ అర్హుడని తెలిపారు.

గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా సోమవారం 20 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. అలాగే 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. బందీల విడుదల సందర్భంగా ట్రంప్ ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఇక ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ట్రంప్‌కు గొప్ప ఘనత దక్కింది. ఎంపీలంతా నిలబడి చప్పట్లతో అభినందించారు.

 

Exit mobile version