NTV Telugu Site icon

Pakistan SCO Meeting: నేటి నుంచి పాకిస్థాన్‌లో ఎస్‌సీఓ సదస్సు.. హాజరుకానున్న జైశంకర్..

Sco

Sco

Pakistan SCO Meeting: పాకిస్థాన్ వేదికగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు నేటి (మంగళవారం) నుంచి ప్రారంభం కానుంది. ఇందు కోసం పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశంలో పెరుగుతున్న ఉగ్రవాద దాడులతో పాటు జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ చేస్తున్న నిరసనల కారణంగా శాంతిభద్రతల పరిస్థితి మరింత దిగజారుతుందనే భయంతో ఈ రెండు రోజుల పాటు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, ఈ సదస్సుకు విదేశీ ప్రతినిధులు ఇప్పటికే చేరుకున్నారు. SCO సదస్సులో భారతదేశం తరపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొంటారు. చైనా, రష్యా ప్రధాన మంత్రులతో సహా ఎస్‌సీఓ సభ్య దేశాల నేతలు బెలారస్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్థాన్ ప్రధానులతో పాటు ఇరాన్ వైస్ ప్రెసిడెంట్ కూడా రానున్నారు. కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (CHG) సమావేశంలో ఆర్థిక, వాణిజ్యంతో పాటు పర్యావరణం లాంటి వివిధ అంశాలపై చర్చించనున్నారు.

Read Also: AP Liquor Shops: నేటితో మూతపడనున్న ప్రభుత్వ వైన్‌షాపులు..

కాగా, పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ప్రస్తుత కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఛైర్మన్‌గా సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఇక, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రష్యా నుంచి 76 మంది, చైనా నుంచి 15 మంది, భారత్ నుంచి నలుగురు, కిర్గిస్థాన్ నుంచి నలుగురు, ఇరాన్ నుంచి ఇద్దరు సభ్యుల ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ చేరుకున్నాయి. ఇక, 11 ఏళ్ల తర్వాత చైనా ప్రధాని లీ కియాంగ్ పర్యటించడం ఇదే తొలిసారి. మరోవైపు, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు, పారామిలటరీ బలగాలు, ఆర్మీ బలగాలను మోహరించారు. ఇస్లామాబాద్‌లో అన్ని రకాల రాజకీయ సమావేశాలు, నిరసనలను అక్కడి ప్రభుత్వం నిషేధించింది.

Show comments