NTV Telugu Site icon

Canada Issue: కెనడా ప్రధానివి సిగ్గులేని వ్యాఖ్యలు..అమెరికా దీంట్లో కలుగజేసుకోవద్దు.. యూఎస్ ఎక్స్‌పర్ట్స్

Canada

Canada

Canada Issue: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత్ కారణమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించడం రెండు దేశాల మధ్య దౌత్య వివాదానికి కారణమైంది. ఇరుదేశాలు పరస్పరం దౌత్యవేత్తలను బహిష్కరించుకోవడంతో ఈ ఘర్షణ తారాస్థాయికి చేరింది. ఇప్పటికే ఈ వివాదంపై అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు తమ ఆందోళనలను తెలియజేశాయి.

ఇదిలా ఉంటే అమెరికాలోని కొందరు నిపుణులు కెనడా ప్రధాని వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు ‘సిగ్గులేని, విరక్తికరమైనవి’గా యూఎస్ ఎక్స్‌పర్ట్స్ నిందిస్తున్నారు. ఖలిస్తాన్ ఉద్యమం అహం, లాభదాయకమైన ఉద్యమని, వారి చేతుల్లో ట్రూడో ఆడుతున్నారని హడ్సన్ ఇన్స్టిట్యూట్ థింక్-ట్యాంక్‌ ప్యానెల్ చర్చలో పాల్గొన్న అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్ ఫెలో మైఖేల్ రూబిన్ అన్నారు. కెనడా విషయంలో అమెరికా మద్దతు తెలపవద్దని కోరారు.

సిక్కు వేర్పాటువాది, ఇండియా చేత టెర్రరిస్టుగా గుర్తించబడిన హర్దీప్ సింగ్ నిజ్జర్ ని కెనడాలోని సర్రేలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అయితే ఈ హత్య భారత ఏజెంట్ల పనే అని కెనడా ఆరోపించిన నేపథ్యంలో కెనడా భారత సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించింది. భారత్ కూడా ఇదే విధంగా కెనడియన్ దౌత్యవేత్తను 5 రోజుల్లో ఇండియా వదిలి వెళ్లాలని ఆదేశించింది. కెనడా వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమైన, ప్రేరేపిత ఆరోపణలని ఇండియా ఖండించింది.

Read Also: Bigg Boss: బిగ్‌బాస్‌ షో నిలిపివేయాలన్న పిటిషనర్‌కు ఏపీ హైకోర్టు షాక్..

కెనడా ప్రధాని చేసిన ఆరోపణలపై మైఖైల్ రూబిన్ మండిపడ్డారు. కెనడాలో కరీమా బలూచ్ హత్య జరిగింది. దీని వెనక పాకిస్తాన్ హస్తముందనే ఆరోపణలు వచ్చినా కెనడా పట్టించుకోలేదని ఆయన రూబిన్ ఆరోపించారు. ట్రూడోకు ఇది రాజకీయంగా ఉపయోగపడవచ్చు, కానీ వారు నిప్పుతో చెలగాలం ఆడుతున్నారని ఆయన అన్నారు. ఖలిస్తాన్ ఉద్యమాన్ని పునరుద్ధరించేందుకు కొన్ని బయట శక్తులు ప్రయత్నిస్తున్నాయని అన్నారు.

ఇదిలా ఉంటే ఖలిస్తాన్ ఉద్యమం అమెరికాలోని మెజారిటీ సిక్కులకు ప్రాతినిధ్యం వహించడం లేదని అమెరికా సిక్కుల ప్రతినిధి జస్సీ సింగ్ అన్నారు. భారతదేశంలో సిక్కులు ఖలిస్తాన్ కి అనుకూలంగా లేరని, సిక్కులు భారతదేశాన్ని పాకిస్తాన్, చైనా నుంచి రక్షించే పనిలో భారత సైన్యంలో ఉన్నారని అన్నారు. అమెరికాలో ఒక మిలియన్ సిక్కులు ఉన్నారని, వీరిలో కొద్ది మంత్రి మాత్రమే ఖలిస్తాన్ డిమాండ్ చేస్తూ నిరసనలు తెలుపుతున్నారని చెప్పారు.