Site icon NTV Telugu

SCO Summit: ఉజ్బెకిస్తాన్ చేరుకున్న ప్రధాని.. పుతిన్‌తో భేటీ కానున్న మోడీ

Sco Summit

Sco Summit

SCO Summit: రెండు సంవత్సరాల కొవిడ్ పరిస్థితుల తర్వాత ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ 22వ శిఖరాగ్ర సమావేశం శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం సమర్‌కండ్ చేరుకున్నారు. ఈ సదస్సు నేపథ్యంలో నాయకులు షాంఘై సహకార సంస్థ కార్యకలాపాలను సమీక్షించాలని, భవిష్యత్ సహకారం కోసం అవకాశాలను చర్చించాలని భావిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో.. ప్రాంతీయ భద్రతా సవాళ్లు, వాణిజ్యం, ఇంధన సరఫరా పెంపు, ఉగ్రవాద నిర్మూలన తదితర అంశాలపై ఈ కూటమికి చెందిన సభ్య దేశాల నేతలు చర్చించనున్నారు.

ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోవ్‌లను కలవనున్నారు. మరికొన్ని ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే, జిన్‌పింగ్‌తోనూ ఆయన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారా? లేదా? అన్నది మాత్రం తెలియరాలేదు. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తర్వాత… పుతిన్‌తో జిన్‌పింగ్‌ ఇక్కడ నేరుగా భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేయడానికి ముందు 2019లో జూన్‌లో బిష్కేక్‌లో ఎస్‌సీవో సదస్సులో దేశాల నేతలు ప్రత్యక్షంగా పాల్గొనగా.. రెండేళ్ల తర్వాత ఈ నేతలందరూ ముఖాముఖి సమావేశం కానుండడం ఇదే ప్రథమం. బిష్కేక్‌లో సదస్సు తర్వాత రష్యా, తజికిస్థాన్ అధ్యక్షతన తదపరి రెండు శిఖరాగ్ర సమావేశాలు వర్చువల్ ఫార్మాట్‌లో జరిగాయి.

CUET UG-2022 Results: సీయూఈటీ-యూజీ ఫలితాలు వచ్చేశాయ్..

ఉగ్రవాదం సహా ప్రాంతీయంగా ఎదురవుతున్న సవాళ్లపై సదస్సులో చర్చించనున్నారని, ఉగ్రవాద సమస్య మూలాలు ఎక్కడున్నాయన్నది ఈ బృందానికి లోతైన అవగాహన ఉందని విదేశాంగ కార్యదర్శి వినయ్‌ క్వాత్ర పేర్కొన్నారు. పాకిస్థాన్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉజ్బెకిస్థాన్‌కు బయలుదేరి వెళ్లేందుకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఎస్‌సీవో సదస్సు సందర్భంగా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై వివిధ దేశాల అధినేతలతో అభిప్రాయాలు పంచుకుంటానని చెప్పారు. ఈ కూటమిని మరింత విస్తృతం చేయడం; పరస్పర, బహుముఖ ప్రయోజనాల నిమిత్తం కూటమిలో సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తామన్నారు. పర్యాటక, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక రంగాలకు సంబంధించి కీలక నిర్ణయాలు ఉంటాయని ప్రధాని వెల్లడించారు.

1996లో ఏర్పాటైన షాంఘై ఫైవ్, 2001లో ఉజ్బెకిస్థాన్‌ను చేర్చడంతో షాంఘై సహకార సంస్థ (SCO)గా మారింది. భారతదేశం, పాకిస్తాన్ 2017లో ఇందులో చేరడం, 2021లో ఇరాన్‌ను పూర్తి సభ్యునిగా చేర్చుకోవాలనే నిర్ణయంతో ఎస్‌సీవో అతిపెద్ద బహుపాక్షిక సంస్థలలో ఒకటిగా అవతరించింది. ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు 30 శాతం, ప్రపంచ జనాభాలో 40 శాతం వాటా కలిగి ఉంది.రెండు రోజుల పాటు కొనసాగే ఈ సమావేశాల్లో ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలు చర్చకు రానున్నాయి. 2001లో ప్రారంభమైన షాంఘై సహకార సంస్థలో 8 దేశాలు.. చైనా, కజక్‌స్థాన్‌, కిర్గిజిస్థాన్‌, రష్యా, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, భారత్‌, పాకిస్థాన్‌లకు పూర్తిస్థాయి సభ్యత్వం ఉంది. భారత్‌, పాక్‌లు 2017లో పూర్తిస్థాయి సభ్యులయ్యాయి. ఎస్‌సీవోలో పరిశీలక దేశాలుగా…అఫ్గానిస్థాన్‌, బెలారస్‌, మంగోలియా కొనసాగుతున్నాయి. కంబోడియా, నేపాల్‌, శ్రీలంక, తుర్కియే, ఆర్మేనియా, అజర్‌బైజాన్‌లు చర్చల్లో భాగస్వామ్య హోదాను కలిగి ఉన్నాయి.

Exit mobile version