Site icon NTV Telugu

SCO Summit: ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సు నేడే ప్రారంభం.. ఒకే వేదికపై మోదీ, పుతిన్, జిన్‌పింగ్

Sco Summit

Sco Summit

SCO Summit: షాంఘై సహకార సంస్థ(SCO) సభ్యదేశాల 22వ శిఖరాగ్ర సదస్సు గురువారం ఉజ్బెకిస్తాన్‌లోని చారిత్రక నగరం సమర్‌కండ్‌లో ప్రారంభం కానుంది. ఈ సదస్సు నేడు,రేపు రెండు రోజుల పాటు జరగనుంది. కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేయడానికి ముందు 2019లో జూన్‌లో బిష్కేక్‌లో ఎస్‌సీవో సదస్సులో దేశాల నేతలు ప్రత్యక్షంగా పాల్గొనగా.. రెండేళ్ల తర్వాత ఈ నేతలందరూ ముఖాముఖి సమావేశం కానుండడం ఇదే ప్రథమం. బిష్కేక్‌లో సదస్సు తర్వాత రష్యా, తజికిస్థాన్ అధ్యక్షతన తదపరి రెండు శిఖరాగ్ర సమావేశాలు వర్చువల్ ఫార్మాట్‌లో జరిగాయి.

ఒకే వేదికపై భారత ప్రధాని మోదీ, పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఒకే వేదికను పంచుకోనుండడం ప్రస్తుత శిఖరాగ్ర సదస్సు ప్రత్యేకత. 1996లో ఏర్పాటైన షాంఘై ఫైవ్, 2001లో ఉజ్బెకిస్థాన్‌ను చేర్చడంతో షాంఘై సహకార సంస్థ (SCO)గా మారింది. భారతదేశం, పాకిస్తాన్ 2017లో ఇందులో చేరడం, 2021లో ఇరాన్‌ను పూర్తి సభ్యునిగా చేర్చుకోవాలనే నిర్ణయంతో ఎస్‌సీవో అతిపెద్ద బహుపాక్షిక సంస్థలలో ఒకటిగా అవతరించింది. ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు 30 శాతం, ప్రపంచ జనాభాలో 40 శాతం వాటా కలిగి ఉంది.రెండు రోజుల పాటు కొనసాగే ఈ సమావేశాల్లో ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలు చర్చకు రానున్నాయి. 2001లో ప్రారంభమైన షాంఘై సహకార సంస్థలో 8 దేశాలు.. చైనా, కజక్‌స్థాన్‌, కిర్గిజిస్థాన్‌, రష్యా, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, భారత్‌, పాకిస్థాన్‌లకు పూర్తిస్థాయి సభ్యత్వం ఉంది. భారత్‌, పాక్‌లు 2017లో పూర్తిస్థాయి సభ్యులయ్యాయి. ఎస్‌సీవోలో పరిశీలక దేశాలుగా…అఫ్గానిస్థాన్‌, బెలారస్‌, మంగోలియా కొనసాగుతున్నాయి. కంబోడియా, నేపాల్‌, శ్రీలంక, తుర్కియే, ఆర్మేనియా, అజర్‌బైజాన్‌లు చర్చల్లో భాగస్వామ్య హోదాను కలిగి ఉన్నాయి.

షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొంటున్న అగ్రనేతలు పనిలో పనిగా ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశాలున్నాయి. అయితే, భారత్‌-పాక్‌, భారత్‌-చైనా నేతల మధ్య ఈ సందర్భంగా చర్చలకు అవకాశం ఉంటుందా అనే విషయమై ఆసక్తి నెలకొంది. ఉజ్బెకిస్థాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల సమావేశంలో భారత్‌ మార్కెట్‌లో రష్యా ఎరువులు, వాణిజ్యం అజెండాలో ఉన్నాయని రష్యా వార్తా పత్రిక క్రెమ్లిన్ వెల్లడించింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ సమావేశం జరగనుంది. ఇరువురు నేతలు వ్యూహాత్మక స్థిరత్వం, ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని పరిస్థితులు, యూఎన్, జీ20లో ద్వైపాక్షిక సహకారం వంటి అంశాలపై కూడా చర్చిస్తారని భావిస్తున్నారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్‌ల భేటీని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇంకా ధృవీకరించలేదు. ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు పశ్చిమ దేశాల నుంచి ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా నుంచి భారత్ ముడి చమురును కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది.

Aswani Dutt Birthday Special ::అశ్వనీదత్ ‘వైజయంతీ’ వైభవం!

ఈ సదస్సుకు హాజరయ్యే విషయాన్ని చివరి క్షణంలో నిర్ధారించడంతో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పాల్గొనడంపై నెలకొన్న సందేహాలు తొలగిపోయాయి. కజక్‌స్థాన్‌ పర్యటనలో ఉన్న జిన్‌పింగ్‌ అటు నుంచి ఉజ్బెకిస్థాన్‌కు వస్తున్నట్లు స్వయంగా వెల్లడించడం విశేషం. తూర్పు లద్దాఖ్‌లోని వివాదాస్పద పెట్రోలింగ్‌ పాయింట్‌-15 నుంచి భారత, చైనా బలగాలు వెనక్కి మళ్లిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కొంత వరకు సడలింది. ఈ పరిస్థితుల్లో మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య ద్వైపాక్షిక భేటీ జరుగుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. సదస్సు సందర్భంగా భారత్‌, పాక్‌ ప్రధానులు పరస్పరం ఎదురుపడితే మర్యాద పూర్వకంగా పలకరించుకోవడం మినహా రెండు దేశాల నేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది.

ప్రాంతీయ భద్రత-సంబంధిత ఆందోళనలు, రక్షణ, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారం మొదలైన వాటిపై సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని భారతదేశం దృఢంగా పిలుపునిచ్చింది.షాంఘై సహకార సంస్థ భారతదేశానికి తీవ్రవాద వ్యతిరేకతపై బహుపాక్షిక, ప్రాంతీయ కార్యక్రమాలను ప్రారంభించడానికి, అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారాన్ని ఎదుర్కోవటానికి ఒక అవకాశాన్ని కూడా అందిస్తుంది. ఉదాహరణకు, పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా తన ప్రాక్సీ యుద్ధంలో నార్కో-టెర్రరిజాన్ని కొత్త ఆయుధంగా ఉపయోగిస్తోంది. కాశ్మీర్ లోయలో గత ఐదేళ్లలో హెరాయిన్ దుర్వినియోగం 2,000 శాతం పెరిగింది. ఎస్‌సీవో సదస్సులో భారత్ తన పొరుగువారి ప్రవర్తనను హైలైట్ చేయడం ద్వారా దౌత్యం ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కోవచ్చు.

Exit mobile version