NTV Telugu Site icon

TOI-6713.01: “తనలో తాను కరుగుతున్న వింత గ్రహం”.. గురుడి ఉపగ్రహంతో పోలిక..

Toi 6713.01

Toi 6713.01

Io on steroids: ఖగోళ శాస్త్రవేత్తలు విశాల విశ్వంలో మనకు తెలియని ఎన్నో వింతలు ఉన్నాయి. సౌర కుటుంబం వెలుపల ఉన్న గ్రహాలపై శాస్త్రవేత్తలకు ఎప్పటి నుంచో ఆసక్తి నెలకొని ఉంది. ఈ ఆసక్తి కారణంగా ఎన్నో ఎక్సోప్లానెట్స్ వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా జీవానికి యోగ్యంగా ఉండే గ్రహాల కోసం వెతుకుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్న గ్రహం మాత్రం ఇప్పటి వరకు కనుగొన్న వాటి కన్నా చాలా భిన్నంగా ఉంది.

శాస్త్రవేత్తలు ‘‘తనలో తాను కరుగుతున్న’’ వింత గ్రహాన్ని కనుగొన్నారు. ఒక విధంగా చెప్పాలంటనే తనను తాను తింటున్నట్లు. లైవ్ సైన్స్ నివేదికలో ఈ గ్రహం గురించిన వివరాలు ప్రచురించారు. ఈ ఎక్సోప్లానెట్‌కి TOI-6713.01 అని పేరు పెట్టారు. ఇది చాలా చురుకైన అగ్నిపర్వతాలను కలిగి ఉంది. అవి నిరంతరం విస్పోటనం చెందుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇది అంతరిక్షం నుంచి చూసినప్పుడు మండుతున్న ఎర్రటి మెరుపును గుర్తుకు తెస్తుంది. ఇంతకుముందు ఎన్నడూ ఇలాంటి గ్రహం కనిపించలేదని, దీనికి సంబంధించిన మరిన్ని లక్షణాలు తెలుసుకోవడానికి మరింత పరిశీలన అవసరమని వారు అభిప్రాయపడ్డారు.

Read Also: West Bengal: బీజేపీ ఎంపీ అభ్యర్థిపై రాళ్లదాడి.. పరుగులు తీసిన భద్రతా సిబ్బంది, మీడియా..

ఈ గ్రహం భూమికి 66 కాంతి సంవత్సరాల దూరంలో ఒక మరుగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. భూమి పరిమాణంతో పోలిస్తే కాస్త పెద్దగా ఉన్న ఈ గ్రహం 2.2 రోజుల్లోనే దాని కక్ష్యను పూర్తి చేస్తోంది. NASA యొక్క ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (TESS) గ్రహం యొక్క ఉపరితలం అగ్నిపర్వతాల లావాతో కప్పబడి ఉన్నట్లు గుర్తించింది. అక్కడ ఉష్ణోగ్రత 2300 డిగ్రీ సెల్సియస్ మించిపోయింది. పరిశోధకులు ఈ గ్రహాన్ని ‘‘అయో ఆన్ స్టెరాయిడ్స్’’గా అభివర్ణించారు. అయో(Io) అనేది గురుడి ఉపగ్రహాల్లో ఒకటి. మన సౌరవ్యవస్థలో అత్యంత చురుకైన అగ్నిపర్వతాలను కలిగి ఉంది. ఇది గురు గ్రహం యొక్క మూడో అతిపెద్ద చంద్రుడు. ఈ గ్రహం ప్రతీ అంగుళం కూడా అగ్నిపర్వతాలతో కప్పబడి, నిత్యం క్రియాశీలకంగా ఉంటుంది. దీంతో కొత్తగా కనుగొన్న గ్రహాన్ని అయోతో పోల్చారు.

కొత్తగా కనుగొనబడిన గ్రహం ఆర్బిట్ బుధుడి లాగా అత్యంత దీర్ఘవృత్తాకారంలో ఉందని Space.com తెలిపింది. TOI-6713.01 గ్రహం తన నక్షత్రాన్ని దాదాపుగా తాకే దూరంలో ఉంది. మరో రెండు గ్రహాలు ఈ గ్రహంపై గురుత్వాకర్షణ శక్తిని చూపిస్తున్నాయి. దీని ఫలితంగా గ్రహంలో కరిగిన సున్నితమైన భాగాన్ని విస్తరించడం లేదా, ట్విస్ట్ చేయడం జరుగుతోంది. గ్రహం క్రమం తప్పకుండా దాని నక్షత్రానికి దగ్గరగా , ఆపై దూరంగా కక్ష్యలో ఉంటుంది.

Show comments