NTV Telugu Site icon

Saudi Arabia: క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్‌పై సంచలన ఆరోపణలు.. యుద్దం కోసం తండ్రి సంతకం ఫోర్జరీ..

Saudi Prince

Saudi Prince

Saudi Arabia: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్(ఎంబీఎస్)పై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులపై సౌదీ యుద్ధాన్ని ప్రారంభించేందుకు ఎంబీఎస్ తన తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు సౌదీకి చెందిన మాజీ అధికారి ఒక నివేదికలో ఆరోపించారు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌదీ మాజీ అధికారి సాద్ అల్-జబ్రీ ఈ ఆరోపణలు చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై సౌదీ అరేబియా వెంటనే స్పందించలేదు. అతడిని ‘‘పరువు లేని మాజీ అధికారి’’గా సౌదీ అభివర్ణించింది. కెనడాలో ప్రవాసంలో జీవిస్తున్న అల్-జబ్రీని సౌదీ అరేబియాకి తిరిగి రప్పించేందుకు అతడిన ఇద్దరు పిల్లలను జైలులో ఉంచడంపై అనేక ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది.

Read Also: Murder : జూనియర్ ఆర్టిస్ట్ హత్య.. భర్తే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం

ప్రస్తుతం ప్రిన్స్ ఎంబీఎస్ తన తండ్రి 88 ఏళ్ల రాజు సల్మాన్ స్థానంలో వాస్తవ పాలకుడిగా పనిచేస్తున్నారు. 2015లో యెమెన్ యుద్ధం ప్రారంభమైన సమయంలో, ఎంబీఎస్ అధికారం అధిరోహించే ప్రారంభ సమయంలో, అతనిపై ఉన్న అసమ్మతిని విస్తృతంగా అణిచివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సౌదీ అంతర్గత మంత్రిత్వ శాఖకు చెందిన నమ్మదగిన అధికారి తెలిపిన దాని ప్రకారం.. తన తండ్రి స్థానంలో యుద్ధం ప్రకటిస్తూ ప్రిన్స్ ఎంబీఎస్ రాయల్ డిక్రీపై సంతకం చేసినట్లు అల్-జబ్రీ ఆరోపించారు. యెమెన్‌పై భూతల దాడికి సంబంధించి రాయల్ డిక్రీ ఉన్నట్లు తెలిపారు. ‘‘రాజాజ్ఞ కోసం అతను తన తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. రాజు మానసిక సామర్థ్యం క్షీణిస్తోంది’’ అన్నారు.

ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా యెమెన్‌పై యుద్ధం జరిగింది. దాదాపు ఒక దశాబ్ధం పాటు ఇది కొనసాగింది. యుద్ధంలో 1,50,000 కంటే ఎక్కువ మంది మరణించారు. ప్రపంచంలో ఘోరమైన మానవతా సంక్షోభాన్ని సృష్టించింది. యుద్ధ సమయంలో ఎంబీఎస్ రక్షణ మంత్రిగా ఉన్నారు. అల్-జబ్రీ సెప్టెంబరు 11, 2001 దాడుల తర్వాత సౌదీలో అల్-ఖైదా మిలిటెంట్‌లకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో యుఎస్‌కి నమ్మకస్తుడైన మాజీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ నయేఫ్ కోసం పనిచేశాడు. కింగ్ సల్మాన్ 2017లో తన కుమారుడు ఎంబీఎస్‌ని క్రౌన్ ప్రిన్స్ హోదాలోకి తీసుకువచ్చాడు. ఎంబీఎస్ తనను చంపాలని చూస్తున్నాడని అల్-జబ్రీ ఆరోపించారు. నేను చనిపోయే వరకు అతను విశ్రమించడని ఆయన పేర్కొన్నాడు.