భారత్‌కు ఎస్-400 ట్రయంఫ్ గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థలను ముందుగా నిర్ణయించుకున్న గడువు ప్రకారమే అందజేయనున్నట్లు రష్యా తెలిపింది. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా ‘ఎస్-400’ సరఫరాలో జాప్యం చోటుచేసుకుంటుందేమోనని భారత్‌లో ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మన దేశంలో రష్యా రాయబారి డేనిస్ అలిపోవ్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా-భారత దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం సందర్భంగా భారతదేశంలో రష్యా రాయబారి డేనిస్ అలిపోవ్ మాట్లాడుతూ.. S-400 ట్రయంఫ్ గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థ నిర్ణయించుకున్న గడువుకు అనుగుణంగా ముందుకు సాగుతోందని అన్నారు. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 75 ఏళ్లవుతున్న సందర్భంగా ‘రష్యా డైజెస్ట్’ అనే మేగజీన్‌కు ఆయన ముందుమాట రాశారు. పశ్చిమ దేశాలకు చెందిన అనేక కంపెనీలు బయటకు వెళ్లిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతం తమ దేశ విపణిలో భారత వ్యాపారాలకు అవకాశాలు పుష్కలంగా అందుబాటులోకి వచ్చినట్లయిందని అందులో పేర్కొన్నారు.
భారత్‌కు ఎస్–400 సరఫరా విషయంలో.. తమపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల ప్రభావం ఏదీ ఉండదని రష్యా ఇటీవలే స్పష్టం చేసింది. ఎస్–400 ట్రయంఫ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ ఐదు యూనిట్ల కొనుగోలు కోసం భారత్ 2018 అక్టోబర్‌లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.5.43 బిలియన్ డాలర్లు. దీనిపై అప్పట్లో అమెరికా ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ భారత్ లెక్కచేయలేదు. ఒప్పందంపై తమ మాట వినకుండా ముందుకు వెళితే భారత్‌పై ఆంక్షలు విధిస్తామని డొనాల్డ్ ట్రంఫ్ ప్రభుత్వం హెచ్చరించింది.వాటిలో తొలి యూనిట్ అందజేత ప్రక్రియ గత ఏడాది డిసెంబరులో, రెండో రెజిమెంట్ సరఫరా ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమైంది.