Site icon NTV Telugu

Russia: రష్యా అమ్ములపొదిలో అధునాతన క్షిపణి.. ప్రపంచంలో దీనికి సాటి లేదన్న పుతిన్

Russia Putin

Russia Putin

Russia’s Zircon Hypersonic Missile: ఉక్రెయిన్, రష్యా యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. మరోవైపు తన దేశం సర్వనాశనం అవుతున్నా..ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ యుద్ధాన్ని ఆపి, రష్యాతో చర్చలకు వెళ్లేందుకు సుముఖత చూపించడం లేదు. మరన్ని ఆయుధాలు కావాలంటూ అమెరికా పర్యటనకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. రష్యా అమ్ముల పొదిలో అధునాతన క్షిపణి చేరినట్లు వెల్లడించారు. దీనికి ప్రపంచంలో సాటి లేదని ఆయన అన్నారు.

Read Also: Masooda: బెస్ట్ హారర్ సినిమా స్ట్రీమింగ్ మొదలయ్యింది…

రష్యా తన ‘జిర్కాన్ హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి’ జనవరిలో సైన్యంలో చేరుతుందని పుతిన్ వెల్లడించారు. రష్యా ఇటీవల కాలంలో అభివృద్ధి చేసిన అత్యాధునిక క్షిపణి ఇదే. ప్రపంచంలో దీనికి సాటి అయిన క్షిపణి మరేది లేదని పుతిన్ బుధవారం వెల్లడించారు. జనవరి నుంచి అడ్మిరల్ గోర్ష్‌కోవ్ యుద్ధనౌకలో కొత్త జిర్కాన్ హైపర్‌సోనిక్ క్షిపణిని అమర్చనున్నట్లు ఆయన వెల్లడించారు. దేశ అత్యున్నత స్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ తాజాగా అమెరికా వాషింగ్టన్ పర్యటనకు వెళ్లారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం అయింది. తొలిసారిగా జెలన్ స్కీ యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్ వదిలి విదేశీ పర్యటనకు వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో భేటీ కానున్నారు. దీంతో పాటు యుద్ధం కోసం ఆర్థిక, సైనిక, ఆయుధ సహాయాన్ని కోరనున్నారు. రష్యా ఇరాన్ తయారీ డ్రోన్లతో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్న నేపథ్యంలో అమెరికా నుంచి పేట్రియాట్ క్షిపణి వ్యవస్థను జెలన్ స్కీ కోరుతున్నారు. అమెరికా కూడా ఈ క్షిపణి వ్యవస్థను ఉక్రెయిన్ కు ఇచ్చేందుకు సిద్ధం అయింది.

Exit mobile version