Russia-Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా తీవ్రంగా దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలపై నియంత్రణ కోసం ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా తాగు నీరు, కరెంట్, ఇతర మౌళిక సదుపాయాలే లక్ష్యంగా రాకెట్లు, డ్రోన్లతో రష్యా ఉక్రెయిన్ పట్టణాలపై విరుచుకుపడుతోంది. మిలియన్ల మంది తాగునీరు, కరెంట్ లేకుండా అల్లాడుతున్నారు. రాజధాని కీవ్ తో పాటు ఖార్కీవ్, ఒడెసా నగరాలపై రష్యా దాడులు చేసింది. దీంతో ఆయా నగరాల్లో విద్యుత్ స్తంభించిపోయింది. కీవ్ మేయర్ విటాలి క్లిట్ష్కీ మాట్లాడుతూ.. కీవ్ లో 15 శాతం ఇళ్లకు విద్యుత్ సరఫరా లేదని చెప్పారు. రష్యా సరిహద్దులోని ఖార్కీవ్ ప్రాంతంలో కూడా 15కు పైగా దాడులు జరిగినట్లు అక్కడి గవర్నర్ తెలిపారు.
Read Also: Bhatti Vikramarkaa: నీకు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్టా..!
మరోవైపు బుఖ్ ముత్ నగరంపై పట్టు కోసం రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నగరం రష్యా స్వాధీనం చేసుకుంటే ఉక్రెయిన్ లోని తూర్పు ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లడానికి రష్యాకు మరింత సానుకూలంగా మారుతుంది. దీంతో ఈ నగరాన్ని రష్యా ఆధీనంలోకి వెళ్లకుండా ఉక్రెయిన్ బలగాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. బుఖ్ముత్ రష్యా స్వాధీనం అవుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ భయపడుతున్నారు.
మరోవైపు యూరప్ ప్రాంతంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం అయిన జపొరోజ్జియా అణువిద్యుత్ కేంద్రం రష్యా దాడులతో దెబ్బతింది. యుద్దం ప్రారంభం అయినప్పటి నుంచి రష్యా వరసగా దీనిపై దాడులు చేస్తోంది. తాజాగా రష్యా జరిపిన దాడుల్లో అణు విద్యుత్ ప్లాంట్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుత డిజిల్ జనరేటర్ల సాయంతో నడుస్తున్నట్లు ఉక్రెయిన్ అధికారులు గురువారం వెల్లడించారు.