Site icon NTV Telugu

Russia-Ukraine War: అంధకారంలో ఉక్రెయిన్.. చలికాలం నేపథ్యంలో రష్యా భీకరదాడులు

Russia, Ukraine Awar

Russia, Ukraine Awar

Russia-Ukraine War: ఉక్రెయిన్ పై యుద్ధ తంత్రాన్ని మార్చింది రష్యా. ఇంతకాలం నాటో దేశాల సహాయంలో ఉక్రెయిన్ దాడులు చేస్తూ రష్యాను ఆత్మరక్షణలో పడేసింది. దీంతో మాస్కో తన వార్ ప్లాన్ ను అమలు చేస్తోంది. చలికాలం నేపథ్యంలో ఉక్రెయిన్ ను దెబ్బతీసేలా దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా ఇరాన్ ‘‘కామికేజ్’’ డ్రోన్ల సహాయంతో ప్రధాన నగరాలపై భీకరదాడులు చేస్తోంది. రాజధాని కీవ్ తో సహా, జపొరిజ్జియా, దినిప్రో, జటోమిర్ నగరాల్లోని విద్యుత్ వ్యవస్థలను నాశనం చేస్తోంది. ఇప్పటికే 30 శాతం ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. అయితే మరోవైపు విద్యుత్ పునరుద్ధరించే చర్యలను చేపట్టినా మరికొన్ని రోజుల వరకు ఉక్రెయిన్ అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఒకవేళ విద్యుత్ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించినా.. రష్యా మళ్లీ దాడులు చేయదనే గ్యారెంటీ లేదు. దీంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: T20 World Cup: నేడే భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. అందరి కళ్లు వరుణుడిపైనే..!!

ఇదిలా ఉంటే ఉక్రెయిన్ పౌరులు శరణార్థులుగా మారాలని రష్యా భావిస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. చలికాలం సమయంలో ఉక్రెయిన్ వ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థ దెబ్బతింటే, చలికి తట్టుకోలేక అక్కడి ప్రజలు వేరే ప్రాంతానికి వెళ్తారని రష్యా భావిస్తోంది. చలికాలంలో ఉక్రెయిన్ లోని ఇళ్లల్లో వేడిచేసుకునే యంత్రాలు నడవకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి. వీటికి విద్యుత్ చాలా అవసరం. దీని కారణంగానే ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థపై రష్యా విరుచుకుపడుతోంది. మౌళిక సదుపాయాలను కూడా దెబ్బతీస్తోంది. తాగునీరు వ్యవస్థలు ధ్వంసం అవుతున్నాయి. దీంతో ప్రజలు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ కష్టాలతో పలు ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోతున్నాయి.

కీవ్ నగరంలో 50 వేల మంది అంధకారంలో ఉన్నారు. జటోమిర్ లో 2.5 లక్షల మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పరిస్థితి దారుణంగా తయారైంది. అయితే రష్యా దాడులను ఎదుర్కొంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అయితే 100 శాతం రష్యా క్షిపణులను, డ్రోన్లు అడ్డుకునే టెక్నాలజీ మా దగ్గర లేదని అయితే..తమ మిత్రదేశాల సహకారంలో త్వరలోనే దీన్ని సాధిస్తామని శనివారం ఆయన అన్నారు. ఉక్రెయిన్ మౌళిక వ్యవస్థలే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తుందని ఆరోపించారు.

Exit mobile version