US, Russia and Ukraine Talks: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు? నవంబర్‌లో కీలక త్రైపాక్షిక చర్చలు!

  • రష్యా, ఉక్రెయిన్, అమెరికా చర్చలు
  • జెలెన్‌స్కీ కీలక ప్రకటన
Russia Ukraine War

Russia Ukraine War

US, Russia and Ukraine Talks: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు మరోసారి దౌత్య ప్రయత్నాలు వేగం పుంజుకుంటున్నాయి. ఉక్రెయిన్, రష్యా, అమెరికా దేశాల మధ్య నవంబర్‌లో త్రైపాక్షిక చర్చలు నిర్వహించనున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. అయితే ఈ సమావేశానికి సంబంధించిన ఖచ్చితమైన తేదీ, వేదికను ఆయన వెల్లడించలేదు. 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మూడు దేశాల మధ్య చర్చలు నిర్వహించి, వివాదానికి పరిష్కారం కనుగొనే ప్రయత్నాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఉక్రెయిన్ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. తమ దేశం చర్చలకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రాదేశిక అంశాలకు సంబంధించిన వివాదాలను దేశాధినేతల స్థాయిలో పరిష్కరించాల్సి ఉంటుందని, ఇతర అంశాలను సాంకేతిక బృందాలు చర్చించవచ్చని తెలిపారు. ఈ అంశాలన్నింటినీ నవంబర్‌లో చర్చించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే చర్చలు ఎక్కడ జరుగుతాయి, ఎవరు పాల్గొంటారు, ఎలాంటి ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందనే వివరాలు ఇంకా వెల్లడించలేదు.

ఈ మూడు దేశాల ప్రతినిధుల మధ్య తొలి త్రైపాక్షిక సమావేశం ఈ ఏడాది జనవరిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబిలో జరిగింది. ఆ సమావేశాన్ని యూఏఈ అధికారులు నిర్మాణాత్మక చర్చలుగా అభివర్ణించినప్పటికీ, వివాదంపై తుది ఏకాభిప్రాయం కుదరలేదు. ఆ తర్వాత మరో సమావేశం జరగలేదు. ఇరుపక్షాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. తాజా ప్రకటనతో యుద్ధాన్ని ముగించే దిశగా దౌత్య ప్రయత్నాలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా నవంబర్ 10 తర్వాత ఉక్రెయిన్‌తో త్రైపాక్షిక చర్చలకు అంగీకరించినట్లు క్రెమ్లిన్‌కు చెందిన ఒక అధికారి తెలిపినట్లు సమాచారం. అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్‌తో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో పుతిన్ సుమారు మూడు గంటలపాటు సమావేశమైన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో పుతిన్ మరో ప్రతిపాదనను కూడా ముందుకు తెచ్చినట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతో కలిసి త్రైపాక్షిక సమావేశం నిర్వహించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం ద్వారా యుద్ధానికి రష్యా ప్రయోజనాలకు అనుగుణంగా పరిష్కారం సాధించాలన్నది పుతిన్ ఉద్దేశ్యం. అయితే ఇటువంటి ప్రతిపాదన అమలులోకి వస్తుందా అనే విషయంపై స్పష్టత లేదు.

అమెరికా, రష్యా మధ్య చమురు ఒప్పందానికి సంబంధించిన పరిణామాలు వాషింగ్టన్, కీవ్ మధ్య విభేదాలను పెంచింది. ఈ ఒప్పందాన్ని జెలెన్‌స్కీ విమర్శిస్తూ, ఇది యుద్ధానికి పెట్టుబడి పెట్టినట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు. యుద్ధాన్ని ముగించేందుకు నిజమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మరోవైపు, ట్రంప్ జెలెన్‌స్కీపై విమర్శలు చేస్తూ, యుద్ధాన్ని ముగించేందుకు ఆయన తగినంత కృషి చేయలేదని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమనే అభిప్రాయాన్ని కూడా ట్రంప్ వ్యక్తం చేశారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా-ఉక్రెయిన్ సంబంధాల్లో రాజకీయ విభేదాలు మరింత చర్చనీయాంశమయ్యాయి. అయితే ఉక్రెయిన్ నాయకులు జెలెన్‌స్కీకి మద్దతు తెలుపుతూ, ఆయన దేశానికి నాయకత్వం వహించడం కొనసాగిస్తారని సంకేతాలిచ్చారు. నవంబర్‌లో ప్రతిపాదించిన త్రైపాక్షిక చర్చలు నిజంగా జరుగుతాయా, జరిగితే యుద్ధ విరమణపై ఏకాభిప్రాయం కుదురుతుందా అనే అంశాలపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. భూభాగాలపై వివాదాలు, భద్రతా హామీలు, రష్యా-ఉక్రెయిన్ సంబంధాలు వంటి అంశాలు చర్చల్లో కీలకంగా మారే అవకాశం ఉంది.