NTV Telugu Site icon

Russia-Ukraine War: విరుచుకుపడుతున్న మాస్కో సేనలు.. లక్ష్యమిదే..

Ukraine Min

Ukraine Min

తూర్పు ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక ప్రాంతం డాన్‌బాస్‌లో ఒక భాగమైన సీవిరోడోంటెస్క్‌ను పూర్తిస్థాయిలో చేజిక్కించుకునేందుకు రష్యా దళాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఉక్రెయిన్‌–రష్యా సైనికుల మధ్య వీధి పోరాటాలు జరుగుతున్నాయి. ప్రత్యర్థులతో తమ సైనికులు వీరోచితంగా తలపడుతున్నారని లుహాన్‌స్క్‌ గవర్నర్‌ సెర్నీ హైదాయ్‌ గురువారం ప్రకటించారు.

గనులు, పరిశ్రమలు, సముద్రతీరంతో సుసంపన్నమైన డాన్‌బాస్‌ను హస్తగతం చేసుకునేందుకు తహతహలాడుతున్న రష్యా… ఆ ప్రాంతంలోని పలు నగరాల్లో దాడుల తీవ్రతను పెంచింది. నెలల తరబడి జరుగుతున్న యుద్ధంలో పలు పట్టణాలపై పట్టు చేజార్చుకున్న పుతిన్‌ సేనలు… డాన్‌బాస్‌ విషయంలో మాత్రం పట్టుదలతో చొచ్చుకు వెళ్తున్నాయి. లుహాన్స్క్‌ వీధుల్లో ఉక్రెయిన్‌ సైనికులు భీకరంగా పోరాడుతున్నారని స్థానిక గవర్నర్‌ సెర్నీ హైదాయ్‌ తెలిపారు. ప్రతి వీధిని, ప్రతి ఇంటిని లక్ష్యంగా చేసుకుని సివిరోడోనెట్స్క్‌లో రాకెట్లు, ఫిరంగులు, మోర్టార్లతో మాస్కో సేనలు విరుచుకుపడుతున్నట్టు వెల్లడించారు.

డాన్‌బాస్‌లో రష్యా అనుకూల వేర్పాటువాదులు చాలాకాలంగా ఉక్రెయిన్‌ దళాలపై పోరాడుతున్నారు. సీవిరోడోంటెస్క్‌ కోసం రష్యా సైన్యం–ఉక్రెయిన్‌ సైన్యం వీధి పోరాటాలకు దిగుతుండడం ఆసక్తికరంగా మారింది. యుద్ధంలో ఇలాంటి పరిణామం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మరోవైపు పశ్చిమ ఉక్రెయిన్‌లో జైటోమైర్‌లోని సైనిక శిక్షణ కేంద్రంపై క్షిపణి దాడులు నిర్వహించామని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.

ఉక్రెయిన్‌ సైనికులతో కలిసి కొందరు విదేశీయులు, వాలంటీర్లు తుపాకులు చేతపట్టి యుద్ధరంగంలోకి దిగారు. రష్యా వీరిని కిరాయి హంతకులుగా పేర్కొంటోంది. రాజధాని కీవ్‌కు 125 కిలోమీటర్ల దూరంలోని జైటోమిర్‌లో ఉన్న సైనిక, శిక్షణ స్థావరాన్ని ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. క్షిపణి విధ్వంసక వ్యవస్థతో పాటు రెండు ఆయుధాగారాలను కూడా ధ్వంసం చేసినట్టు తెలిపింది. అయితే, ఈ విషయమై ఉక్రెయిన్‌ నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. లైసిచాన్స్క్‌, బఖ్‌ముట్‌ తదితర ప్రాంతాల్లోనూ రేయింబవళ్లు దాడులు కొనసాగుతున్నాయి. రోజూ కనీసం వంద మంది సైనికులు చనిపోతున్నారని, పరిస్థితి కష్టంగా ఉందని ఉక్రెయిన్‌ రక్షణ మంత్రి రెజ్నికోవ్‌ చెప్పారు. రష్యాపై ఆంక్షలు మరింత కఠినతరం చేయాలని ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు. రష్యాను బలహీనం చేసేందుకు అందరూ ముందుకు రావాలన్నారు.

Marijuana: గంజాయిని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశం అదే..

రష్యా నెలల తరబడి మేరియుపొల్‌పై సాగించిన దాడులకు మొత్తం ఎంతమంది మరణించారన్నది లెక్క తేలడం లేదు. భవన సెల్లార్ల నుంచి వందలాది మృతదేహాలను సిబ్బంది బయటకు తీస్తున్నారు. ఒక్కో భవనంలో 50-100 మృతదేహాలు కనిపిస్తున్నాయి. మేరియుపొల్‌లో కనీసం 21 వేల మంది పౌరులు మృతిచెంది ఉంటారని ఉక్రెయిన్‌ అధికారులు భావిస్తున్నారు.

యుద్ధంలో ఉక్రెయిన్‌ తరపున పోరాడినందుకు గాను ఇద్దరు బ్రిటిష్‌ పౌరులు, ఒక మొరాకో పౌరుడికి రష్యా అనుకూల వేర్పాటువాదులు మరణశిక్ష ఖరారు చేశారు. ఉక్రెయిన్‌లో తమ చేతికి చిక్కిన ఈ ముగ్గురిపై కిరాయి సైనిక కార్యకలాపాలు, ఉగ్రవాదం అనే అభియోగాలు మోపారు. తూర్పు ఉక్రెయిన్‌లో ‘డోంటెస్క్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌’ పేరిట తామే సొంతంగా ఏర్పాటు చేసుకున్న దేశంలోని కోర్టు ద్వారా విచారణ జరిపారు. నేరం రుజువైందని పేర్కొంటూ ముగ్గురికి గురువారం మరణ శిక్ష విధించారు.