మూడు నెలలు గుడుస్తున్నా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఓ కొలిక్కి రావడం లేదు. రష్యా దాడిలో ఉక్రెయిన్ నగరాలు, పట్టణాలు ధ్వంసం అవుతున్నాయి. ముఖ్యంగా తూర్పు ప్రాంతం అయిన డాన్ బోస్ ప్రాంతంలో రష్యా తన దాడిని పెంచింది. ఇప్పటికే రాజధాని కీవ్ తో సహా, ఖార్కివ్, సుమీ, మరియోపోల్ వంటి నగరాలను ధ్వంసం చేసింది రష్యన్ ఆర్మీ. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ లోని 20 శాతం భూమి ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ఇటీవల ప్రకటించారు.
ప్రపంచంలో అత్యుత్తమ సైనిక సామర్థ్యం ఉన్న రష్యా ముందు ఉక్రెయిన్ కోన్ని రోజుల్లోనే లొంగిపోతుందని అంతా అనుకున్నప్పటికీ అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలు ఉక్రెయిన్ కు వ్యూహాత్మక, సైనిక, ఆయుధ సహాయాన్ని అందిస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్ సేనలు రష్యాను ఎదురించి పోరాడుతున్నాయి. ఉక్రెయిన్ దాడిలో ఇప్పటికే రష్యా పలు ఫైటర్ జెట్లను, సైనిక వాహనాలను, ట్యాంకులను పెద్ద సంఖ్యలో కోల్పోయింది. దీంతో పాటు పలువురు రష్యన్ జనరల్స్ యుద్ధంలో మరణిస్తున్నారు.
తాజాగా మరో రష్యన్ ఆర్మీ జనరల్ మరణించారు. తూర్పు ప్రాంతంలో జరుగుతున్న యుద్ధంలో రష్యా జనరల్ రోమన్ కుతుజోవ్ ను ఉక్రెయిన్ బలగాలు చంపేశాయి. ఈ విషయాన్ని రష్యా ప్రభుత్వ యాజమాన్యంలోని మీడియా నివేదించింది. అయితే ఈ విషయాన్ని రష్యన్ ఆర్మీ ఇంకా ధ్రువీకరించలేదు. రోమన్ కుతుజోవ్ మరణాన్ని రష్యా ధ్రువీకరిస్తే మూడు నెలల యుద్ధంలో మరణాంచిన నాల్గవ రష్యన్ జనరల్ అవుతాడు. ఉక్రెయిన్ ప్రకారం కుతుజోవ్ డోనెట్స్క్ లో పీపుల్స్ రిపబ్లిక్ ఒకటో ఆర్మీ కార్ప్స్ కు నాయకత్వం వహిస్తున్నాడని ప్రకటించింది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 12 మంది రష్యన్ జనరల్స్ ను చంపినట్లు తెలిపింది. దీంతో పాటు మొత్తంగా 317 మంది రష్యన్ అధికారులను చంపబడ్డారని.. ఇందులో మూడో వంతు మేజర్లు, లెఫ్టినెంట్ కల్నల్ , కల్నల్స్ ఉన్నారని ఓ నివేదికి వెల్లడించింది.
