Russia-Ukraine War: ఏడు నెలలు గుడుస్తున్నా.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో ఏ మార్పు రావడం లేదు. ఇరు దేశాలు కూడా తమ ప్రయోజనాల కోసం పోరాడుతూనే ఉన్నాయి. రష్యా మిస్సైళ్లతో ఉక్రెయిన్ భూభాగాలపై విరుచుకుపడుతూనే ఉంది. దక్షిణ ఉక్రెయిన్ పారిశ్రామిక నగరం జపొరిజ్జియా ప్రాంతంపై రష్యా మరోసారి దాడి చేసింది. ఏడు మిస్సైళ్లను ప్రయోగించింది. ఈ ఘటనలో ఒక చిన్నారితో పాటు 17 మంది మరణించారని ఉక్రెయిన్ అధికారులు శనివారం తెలిపారు. గురువారం తెల్లవారుజామున ఈ మిస్సైల్స్ ఎటాక్ జరిగింది.
మిస్సైల్ దాడి వల్ల నగరంలోని 5 అంతస్తుల భవనం నేలమట్టం అయింది. జపొరిజ్జియా ప్రతీ రోజూ రాకెట్ దాడికి గురవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం కోసం రష్యా- ఉక్రెయిన్ సేనల మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతోంది. ఈ ప్రాంతంలోనే యూరప్ లో పెద్దదైన జపొరోజ్జియా అణువిద్యుత్ కర్మాగారం ఉంది. ఈ ప్రాంతంపై రష్యా పదేపదే క్షిపణి దాడులు చేస్తోంది. గత వారం జొపొరిజ్జియాలో పౌరుల వాహనాలపై రష్యా దాడి చేసింది. ఈ ఘటనలో మొత్తం 30 మంది మరణించారు.
READ ALSO: Jammu Kashmir Issue: జర్మనీ ప్రకటనపై భారత్ ఆగ్రహం.. మీ జోక్యం అవసరం లేదని స్ట్రాంగ్ కౌంటర్
ఇదిలా ఉంటే శనివారం రష్యా ఆక్రమిత క్రిమియా ప్రాంతంలో రష్యాకు ఎదురుదెబ్బ తాకింది. క్రిమియాలో కీలకంగా ఉన్న వంతెనను ఉక్రెయిన్ బలగాలు పేల్చేశాయి. రష్యాను, క్రిమియాను కలపడంలో ఈ వంతెనే కీలకం. ఇదిలా ఉంటే రష్యా ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న ఖేర్సన్, జపొరిజ్జియా, డోనెట్స్క్, లూహాన్స్క్ ప్రాంతాలపై రష్యా పూర్తిస్థాయిలో నియంత్రణలోకి తీసుకోలేకపోతోంది. ఉక్రెయిన్, రష్యా బలగాలకు ఎదురొడ్డి పోరాడుతున్నాయి. అమెరికా, వెస్ట్రన్ దేశాలు ఇచ్చే ఆయుధాలతో రష్యన్ సైనికులపై విరుచుకుపడుతున్నాయి. దీంతో రష్యా మరింత ఆగ్రహానికి లోనై క్షిపణులతో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది.