Site icon NTV Telugu

Russia-Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడి.. 13 మంది పౌరులు మృతి

Russia Ukraine War

Russia Ukraine War

Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆరంభం అయి ఏడు నెలలకు చేరినా.. ఇరు వైపుల దాడులు ఆగడం లేదు. తాజాగా మరోసారి రష్యా, ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. సెంట్రల్ ఉక్రెయిన్ లోని డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలో రష్యా దాడులు చేసింది. ఈ దాడుల్లో 13 మంది సాధారణ పౌరులు మరణించినట్లు స్థానిక గవర్నర్ వాలెంటివ్ రెజ్నిచెంకో తెలిపారు. రష్యా దాడుల్లో 11 మంది అక్కడిక్కడే మరణించగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్ కు నుంచి డ్నీపర్ నదికి అవతలి వైపు ఉండే మార్గానెట్స్ గ్రామంపై జరిగిన దాడిలోనే 12 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలోని ఎత్తైన భవనాలు, స్కూళ్లు, ఎలక్ట్రిసిటీ లైన్లు దెబ్బతిన్నాయి.

Read Also: We are not Lovers: ప్రేమికులని ముద్ర.. మనస్థాపంతో వారిద్దరు సూసైడ్

ఇదిలా ఉంటే మంగళవారం రష్యా నియంత్రణలో ఉన్న క్రిమియాలోని రష్యా వైమానిక స్థావరంలో పేలుళ్లు జరిగి ఒకరు మరణించారు. క్రిమియాలోని నోవోఫెడోరివ్కా సమీపంలోని సాకీ వైమానిక స్థావరం వద్ద ఈ పేలుడు సంభవించింది. అయితే ఈ దాడికి సంబంధించి ఉక్రెయిన్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దాడి ఎవరు చేశారనేదానిపై స్పష్టత లేదు.

నాటోలో చేరడాన్ని వ్యతిరేకిస్తూ.. రష్యా, ఉక్రెయిన్ పై ఫిబ్రవరిలో సైనిక చర్య మొదలుపెట్టింది. కీవ్ తో పాటు ఖార్కీవ్, సుమీ, మరియోపోల్ నగరాలపై దాడులు చేసింది. మరియోపోల్, ఖార్కీవ్ నగరాలు మసిదిబ్బలను తలపిస్తున్నాయి. అయితే రాజధాని కీవ్ ను దక్కించుకునేందుకు రష్యా దళాలు ప్లాన్ చేసినా.. అమెరికా, యూకే వంటి నాటో దేశాల వ్యూహాత్మక, సైనిక, ఆయుధ సహకారంతో ఉక్రెయిన్ బలగాలు కీవ్ ను కాపాడుకున్నాయి. అయితే కీవ్ దక్కించుకోవడంలో విఫలం అయిన రష్యా.. ప్రస్తుతం తూర్పు ప్రాంతంలోని డాన్ బోస్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ పై దాడులు చేస్తోంది.

Exit mobile version