Site icon NTV Telugu

Russia Ukraine War: ట్రక్కుల్లో 117 డ్రోన్లు,18 నెలల ప్లానింగ్.. రష్యాను దారుణంగా దెబ్బతీసిన ఉక్రెయిన్..

Russia

Russia

Russia Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడితో ప్రపంచమే అబ్బురపడుతోంది. రష్యాలోని సుదూర ప్రాంతాల్లోని వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ విరుచుకుపడింది. మూడేళ్ల యుద్ధంలో ఈ రకంగా రష్యాపై దాడి జరగడం ఇదే తొలిసారి. అణు సామర్థ్యం కలిగిన బాంబర్లను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. 40 కంటే ఎక్కువ రష్యన్ విమానాలు ధ్వంసమైంది. బిలియన్ డాలర్ల నష్టం జరిగింది. టర్కీలో శాంతి చర్చలు ప్రకటించిన రోజే ఈ దాడి జరగడం గమనార్హం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ స్కీ ఈ దాడిని ‘‘అద్భుతమైన ఆపరేషన్’’ అని పిలిచారు.

Read Also: Anna University Case: అన్నా యూనివర్సిటీ విద్యార్థిని అత్యాచార కేసు సంచలన తీర్పు..

అయితే, ఈ ఆపరేషన్ కోసం ఉక్రెయిన్ పక్కా ప్లాన్ చేసింది. 117 డ్రోన్లను వినియోగించి విధ్వంసం సృష్టించింది. ఈ దాడి ప్రణాళికకు 18 నెలలు పట్టింది. ఈ విషయాన్ని జెలెన్ స్కీ స్వయంగా ప్రకటించారు. రష్యా నిఘా, భద్రతా సంస్థ అయిన ఎఫ్ఎస్‌బీ స్థానిక ప్రధాన కార్యాలయం పక్కన ఉన్న కార్యాలయం నుంచే ఈ ఆపరేషన్‌ని సమన్వయం చేసినట్లు వెల్లడించారు. 34 శాతం వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి వాహక నౌకలను ధ్వంసం చేసినట్లు జెలెన్స్కీ వెల్లడించారు. దాదాపుగా 7 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.

‘‘ఆపరేషన్ స్పెడర్ వెబ్’’ పేరుతో ఉక్రెయిన్ నిర్వహించిన ఆపరేషన్‌లో ముర్మాన్స్క్, ఇర్కుట్క్స్, ఇవనోవో, రియాజాన్, అముర్ ప్రాంతాల్లోని 5 వైమానిక స్థావరాలు ధ్వంసమైనట్లు మాస్కో ధ్రువీకరించింది. ఉక్రెయిన్ సరిహద్దు నుండి దాదాపు 4,300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇర్కుట్స్క్ ఓబ్లాస్ట్‌లోని బెలాయా ఎయిర్‌బేస్, ఉత్తరాన ఫ్రంట్‌లైన్‌ల నుండి దాదాపు 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముర్మాన్స్క్ ఓబ్లాస్ట్‌లోని ఒలెన్యా ఎయిర్‌బేస్ ఈ దాడిలో దెబ్బతిన్నాయి. ముందుగా రష్యాలోకి ఉక్రెయిన్ తన డ్రోన్లను అక్రమంగా రవాణా చేసింది. ట్రక్కుల్లో ఏర్పాటు చేసిన చెక్క క్యాబిన్ల కింద డ్రోన్లను దాచిపెట్టారు. దాడి సమయంలో రిమోట్ సాయంతో పైకప్పు తెరుచుకునేలా చేసి, డ్రోన్ల ద్వారా స్వల్ప దూరంలో ఉన్న ఎయిర్ బేస్‌లపై దాడులు నిర్వహించారు.

Exit mobile version