NTV Telugu Site icon

RUSSIA UKRAINE WAR: వెలుగులోకి రష్యా అకృత్యాలు.. ఉక్రెయిన్ సైనికులకు చిత్రహింసలు

Russia War (1)

Russia War (1)

RUSSIA UKRAINE WAR: రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఏ దేశం తగ్గేదేలే అన్నట్లు పోరు సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యా పట్టుబడిన ఉక్రెయిన్ సైనికులను చిత్రహింసలు పెట్టింది. ఈ తాలూకా ఆధారాలు కొన్ని ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఏడు నెలలుగా యుద్ధం చేస్తున్న మాస్కో సైన్యం ఇజియం నగరాన్ని చిత్రహింసలకు కేంద్రంగా మార్చుకుంది. ఇజియం నగరంలో ఉక్రెయిన్‌ సైనికులు, పౌరులను రష్యా సేనలు చిత్రహింసలకు గురిచేసిన పదిప్రాంతాలు వెలుగులోకి వచ్చాయి. బాధితులు పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇజియం నగరంలో ఉన్న పది చిత్రహింస కేంద్రాలను అంతర్జాతీయ మీడియా ఏజెన్సీ సందర్శించింది. డార్క్ రూంలో రష్యా సైన్యం ఉక్రెయిన్ సైనికులను చిత్రహింసలు పెట్టినట్లు సమాచారం. అక్కడనుంచి తప్పించుకున్న 15 మంది ఉక్రెయిన్‌ సైనికులు తాము అనుభవించిన నరకాన్ని మీడియాతో వెల్లబోసుకున్నారు. చిత్రహింసలకు తాళలేక ఎనిమిది మంది అక్కడే చనిపోయినట్లు చెప్పారు. అందులో ఒకరు పౌరుడని బాధిత కుటుంబాలు తెలిపారు.

Read Also: Election Survey: గుజరాత్‌లో మళ్లీ వికసించేది కమలమే..!!

ఇజియం అటవీ ప్రాంతంలోని శ్మశానవాటికలో 447 సమాధులను తవ్వగా అందులో 30 మృతదేహాలపై చిత్రహింసల ఆనవాళ్లు ఉన్నాయి. చేతులు కట్టేసినట్లు, అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చిన గాయాలు, కత్తిగాట్లు, విరిగిపోయిన అవయవాలు కనిపించినట్లు ఖార్కివ్‌లో ప్రాసిక్యూషన్‌ ఆఫీస్ తెలిపింది. సామూహిక ఖననాలు చేసిన చోట మృతదేహాల చేతులు కట్టేసి ఉన్నట్లు పేర్కొంది. ఇదే నగరంలో మరో రెండు భారీ సామూహిక శ్మశానవాటికలు బయటపడినట్లు ఉక్రెయిన్ అధికారవర్గాలు తెలిపాయి.

Read Also:UP Durga Puja: దుర్గపూజలో అపశృతి.. చెలరేగిన మంటలు.. ముగ్గురు మృతి

ఇదిలా ఉంటే రష్యా ఆక్రమించిన ఇజియం నగరాన్ని కొద్ది రోజుల క్రితమే ఉక్రెయిన్‌ తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇక్కడ గాయపడిన వందలాది మందికి చికిత్స చేసిన వైద్యుడు కూడా మాస్కో సైనికుల చిత్రహింసలను ధ్రువీకరించారు. తన వద్దకు చేతులు, కాళ్లపై తుపాకీ గాయాలు, విరిగిన ఎముకలు, తీవ్రమైన కాలిన గాయాలతో వచ్చేవారని తెలిపారు. ఈ గాయాలు ఎలా అయ్యాయో చెప్పేవారు కాదన్నారు. గాయాలతో వచ్చిన సైనికులు కూడా అవి ఎలా అయ్యాయో చెప్పేందుకు ఇష్టపడలేదని వైద్యుడు తెలిపారు.