NTV Telugu Site icon

Ukraine War: ఉక్రెయిన్ యుద్ధంలోకి “కిమ్” ఆర్మీని దింపిన పుతిన్..

Russia , North Korean

Russia , North Korean

Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్‌లోకి ఉత్తర కొరియా సైనికులు ఎంట్రీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. రష్యా తరుపున పోరాడటానికి కిమ్ సైన్యాన్ని పుతిన్ రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. తమపై పోరాటంలో 10,000 మంది ఉత్తర కొరియా సైనికులను మోహరించడానికి రష్యా సిద్ధమవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలన్ స్కీ గురువారం చెప్పారు. ఉత్తర కొరియా రష్యాకి తన సైనికులను పంపిందని జెలన్ స్కీ గతంలో కూడా ఆరోపించారు. అయితే, మొదటిసారి ఎంత మంది సైనికులను పంపించారనే విషయంపై వివరాలు వెల్లడించారు.

Read Also: Jio Smart Shopping Cart: ‘స్మార్ట్ షాపింగ్ కార్ట్’ వచ్చేసింది.. బిల్లింగ్ కోసం క్యూలో నిలబడాల్సిన పనిలేదు!

నార్త్ కొరియా సైనికులు ఆక్రమిత ఉక్రెయిన్‌లో ఉన్నారని, మా నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చిందని చెప్పారు. యూరోపియన్ యూనియన్(ఈయూ) నాయకులతో బ్రస్సెల్స్ వేదికగా జరిగిన చర్చలో ఈ విషయాన్ని వెల్లడించారు. రష్యాకు వ్యతిరేకంగా మద్దతు కోసం జెలన్ స్కీ ఈయూ నాయకుల సమావేశానికి ముందు నాటో మంత్రుల సమావేశానికి హాజరయ్యారు. ఉత్తర కొరియా దళాల్లో ల్యాండ్ ఆర్మీ, వ్యూహాత్మక సిబ్బంది ఉన్నట్లు తెలిపారు.

ఇది ప్రపంచయుద్ధానికి మొదటి అడుగుగా జెలెన్ స్కీ హెచ్చరించాడు. ఇరాన్ కూడా డ్రోన్లు, క్షిపణులను రష్యాకు అందిస్తోందని ఆరోపించాడు. అయితే, ఇరాన్ మాత్రం ఈ వ్యాఖ్యల్ని ఖండించింది. ఇదిలా ఉంటే జూన్ నెలలో పుతిన్, నార్త్ కొరియాలో పర్యటించాడు. ఆ సమయంలో కిమ్ జోంగ్ ఉన్‌తో పలు ఒప్పందాలపై సంతకం చేశారు. ఇందులో పరస్పర రక్షణ ఒప్పందం కూడా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి రష్యా, ఉత్తర కొరియా మిత్రదేశాలుగా ఉన్నాయి. 2022 రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మరింత దగ్గరయ్యాయి.