Site icon NTV Telugu

Ukraine Russia War: ముగిసిన యుద్ధం.. రష్యా కీలక ప్రకటన

ఉక్రెయిన్ పై నెలరోజులకు పైగా యుద్దోన్మాదంతో రెచ్చిపోతున్న రష్యా, అనూహ్యంగా ఒక కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ పై వార్‌లో తొలి దశ ముగిసిందని తెలిపింది. ఇక తూర్పు డాన్ బాస్ ప్రాంతాలపై దృష్టిసారిస్తామని రష్యన్ మిలటరీ ప్రకటించింది. డొంటెస్క్, లుహాంస్క్ లలో రష్యా అనుకూల తిరుగుబాటు దారుల ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. పూర్తిస్తాయిలో వీటిని ఆక్రమించేందుకు వ్యూహం మార్చింది మాస్కో. ఉక్రెయిన్ ప్రతిఘటనతో విసిరివేసారుతున్న రష్యన్ మిలటరీ, చిన్నచిన్న లక్ష్యాల వైపు అడుగులెయ్యాలని వ్యూహం మారుస్తున్నట్టు కనపడుతోంది. అందులో భాగంగానే, క్రిమియా తరహాలో డాన్ బాస్ ప్రాంతాన్నీ, పూర్తిగా తమ కంట్రోల్ తెచ్చుకునేందుకు ప్లాన్ మార్చింది. ఫస్ట్ ఫేజ్‌లో తమ ప్రధాన లక్ష్యం అసంపూర్తిగా ముగిసిందని రష్యన్ జనరల్ స్టాఫ్ అధిపతి ఒప్పుకున్నారు. అయితే, ఉక్రెయిన్ సైనిక సామర్థ్యాన్ని వీలైనంత వరకు కుదించామన్న రష్యా,ఇక మిగతా ఫోకస్ మొత్తం డాన్ బాస్ పైనేనని తెలిపింది.

Read Also: Traffic Pending Challans: త్వరపడండి.. మిగిలింది 5 రోజులే..

రాజధాని కీవ్‌కు తూర్పున వున్న పట్టణాలను తిరిగి స్వాధీనం చేసుకుంటోంది ఉక్రెయిన్ సైన్యం. ఎక్కడికక్కడ రష్యా బలగాలను బోర్డర్‌లకు తరిమికొడుతోంది. అటు సౌత్ ఈస్ట్ పోర్ట్ సిటీ అయిన మరియాపోల్ పూర్తిగా ధ్వంసమైంది. పునర్ నిర్మాణానికి ఏళ్లు పడుతుందని మరియాపోల్ మేయర్ చెప్పారు. అటు గతవారం మరియాపూల్ థియేటర్‌పై రష్యా జరిపిన భీకర దాడిలో దాదాపు 300 మంది చనిపోయారని అధికారవర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్-రష్యా సమరం సాగుతున్న సమయంలో, అమెరికా అధ్యక్షుడు యూరప్ పర్యటన పుతిన్ ను మరింత వేడెక్కిస్తోంది. ఇప్పటికే స్లోవేకియా, పోలాండ్, హంగేరి, బల్గేరియాలకు అదనపు దళాలు పంపాలని నాటో నిర్ణయించింది. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామన్నారు బైడెన్. ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన పోలాండ్‌లో తాజాగా పర్యటించారు బైడెన్. అమెరికా సైనికుల స్థావరాన్ని సందర్శించారు. లక్షలాది ఉక్రెయిన్ శరణార్థులను పోలాండ్ అక్కున చేర్చుకుంటోందని అభినందించారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. మరోవైపు ఉక్రెయిన్ పై మరిన్ని దాడులకు తెగబడుతోంది రష్యన్ ఆర్మీ. సెంట్రల్ ఉక్రెయిన్ లోని మిలటరీ కమాండ్ సెంటర్ పై బాంబు దాడి చేసిందని కీవ్ ప్రకటించింది. అటు ఉక్రెయిన్ ను ఆదుకోవాలని ప్రపంచ దేశాలకు విజ్తప్తి చేశారు అధ్యక్షుడు జెలెన్ స్కీ. పుతిన్ కు వ్యతిరేకంగా మాస్కోలో ఆందోళనలు తీవ్రమయ్యాయి.

Exit mobile version