Russia President Vladimir Putin Responds On Attack On Kyiv: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా సోమవారం క్షిపణి దాడులు చేసిన విషయం తెలిసిందే! ఈ దాడులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వివరణ ఇచ్చారు. రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. తమను రెచ్చగొట్టేలా ఉక్రెయిన్ ఉగ్రవాద దాడులకు పాల్పడిందని.. అందుకు ప్రతిగానే క్షిపణి దాడులు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఇక నుంచి ఉక్రెయిన్ ఈ తరహా దాడులకు పాల్పడరాదని, ఒకవేళ తమ సూచనల్ని బేఖాతరు చేస్తే మాత్రం ఆ దేశంపై తాము మరింతగా విరుచుకుపడతామని వార్నింగ్ ఇచ్చారు. క్రిమియా-రష్యాను అనుసంధానం చేసే కెర్బ్ వంతెన కూల్చివేత.. ముమ్మాటికీ ఉగ్ర చర్యేనని ఆయన తేల్చి చెప్పారు.
కాగా.. ఫిబ్రవరి నుంచి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల రష్యా ఆక్రమణలో ఉన్న కీలకమైన కెర్బ్ బ్రిడ్జిని ఉక్రెయిన్ బలగాలు ధ్వంసం చేశాయి. ట్రక్కు బాంబులతో అ వంతెనను పేల్చేశారు. ఈ పేలుడుతో క్రిమియాతో రష్యాకు లింక్ తెగిపోయింది. ఇందుకు ప్రతీకారంగానే.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో సోమవారం ఉదయం రష్యా మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఎల్వివ్, జైటోమిర్, ఖ్మెల్నిట్స్కీ, డ్నిప్రో, టెర్నోపిల్ నగరాల్లో కూడా పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల కారణంగా భారీగా ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం జరిగిందని, అనేక మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కార్యాలయంపై కూడా మిస్సైల్ దాడి జరిగింది. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.
ఈ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అలాగే రష్యాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మా దేశాన్ని భూమిపై నుంచి పూర్తిగా తుడిచిపెట్టేయాలని రష్యా భావిస్తోంది. జపొరిజియాలో ఇళ్లల్లో నిద్రిస్తున్న ప్రజలతో పాటు డెనిప్రో, కీవ్‌లకు పనులకు వెళ్లే వారిని రష్యా దారుణంగా చంపేసింది. ఉక్రెయిన్ మొత్తం వైమానిక దాడుల సైరన్లు మోగుతున్నాయి. క్షిపణి దాడులు జరుగుతున్నాయి’’ అని జెలెన్‌స్కీ వెల్లడించారు.