NTV Telugu Site icon

Russia – Ukraine War: ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా

Sergie Soigu On Ukraine

Sergie Soigu On Ukraine

ఉక్రెయిన్‌పై మూడు నెలలకుపైగా యుద్ధం కొనసాగిస్తోన్న రష్యా.. తాజాగా డోన్‌బాస్ ప్రాంతం 97 శాతానికి పైగా తమ నియంత్రణలోకి వచ్చిందని మంగళవారం ప్రకటించింది. ముఖ్యంగా లుహాన్స్‌క్‌ ప్రాంతాన్ని పూర్తిగా స్వాదీనం చేసుకున్నామని చెప్పిన రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగూ.. పొపాస్నా, లీమన్, స్వియాటోహిర్స్‌క్‌ సహా 15కు పైగా నగరాలు తమ చేతికి చిక్కినట్లు వెల్లడించారు. అటు ఉక్రెయిన్ సైతం.. డొనెట్స్‌క్‌లో సగం ప్రాంతం రష్యా చేతుల్లోకి వెళ్లిపోయిందని అంగీకరించింది. అయితే.. ఈ ఎదురుదెబ్బలకు కుంగిపోవద్దని, వీధి పోరాటాలతో కోల్పోయిన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని డోన్బాస్‌వాసులకు ఉక్రెయిన్ పిలుపునిచ్చింది.

ఇదిలావుండగా.. ఖెర్సన్, జపోరిజియా ప్రాంతాల్ని స్వాధీనం చేసుకున్నట్టు రష్యా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలోనే తూర్పు ఉక్రెయిన్‌కు మరింత సైన్యాన్ని తరలిస్తోంది. పశ్చిమ దేశాలు సైతం ఉక్రెయిన్‌కు సహకారం అందించడం కోసం అత్యాధునిక ఆయుధాల్ని అందిస్తున్నాయి. అటు.. అమెరికా అందించిన అత్యాధునిక మల్టిపుల్ రాకెట్ లాంచర్ల వాడకంపై సైన్యానికి ఉక్రెయిన్‌ శిక్షణ ఇస్తోంది. మరోవైపు.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ని స్వాధనం చేసుకోవాలని రష్యా సేనలు విశ్వప్రయత్నాలు చేయగా.. ఉక్రెయిన్ సేనల ప్రతిదాడులతో తిరిగి వెనక్కి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలోనే మూడు నెలల తర్వాత కీవ్‌లో నాటక ప్రదర్శనలకు ప్రఖ్యాతి గాంచిన పోదిల్ థియేటర్ తెరుచుకోగా.. తొలి మూడు నాటక ప్రదర్శనలు హౌస్‌ఫుల్‌ అయ్యాయి.

కాగా.. ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలో ఇప్పటివరకూ 31 వేల రష్యా సైనికులు మరణించినట్టు సమాచారం. కానీ, ఈ విషయాన్ని రష్యా రహస్యంగా ఉంచుతోంది. తాజా దాడుల్లో కల్నల్ వ్లాదిమిర్‌ నిగ్మతులిన్‌ (46) మరణించడంతో.. ఈ యుద్ధంలో బలైన రష్యా కల్నల్స్‌ సంఖ్య 50కి చేరింది. అలాగే.. మేజర్‌ జనరల్‌ రోమన్‌ కుజుతోవ్, లెఫ్టినెంట్‌ జనరల్‌ బెర్డ్‌నికోవ్‌ మరణంతో.. మొత్తం 12 మంది రష్యా జనరల్స్ మరణించినట్టు తేలింది.