NTV Telugu Site icon

Russia: రష్యాలో మరో ప్రముఖుడిపై దాడి.. ఉక్రెయిన్, అమెరికా పనే అని ఆరోపణ..

Russia

Russia

Russia: రష్యా అధ్యక్షుడిని హతమార్చేందుకు డ్రోన్లను ప్రయోగించిన కొద్ది రోజుల తర్వాత రష్యాలో మరో ప్రముఖుడిపై హత్యాయత్నం జరిగింది. ప్రముఖ రష్యన్ జాతీయవాద రచయిత, జఖర్ ప్రిలేపిన్ ని శనివారం కారుబాంబుతో హతమార్చాలని చూశారు. ఈ ఘటనలో ఆయన గాయపడగా.. కారు నడుపుతున్న డ్రైవర్ చనిపోయాడు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని అధికారులు అరెస్ట్ చేశారు. ఉక్రెయిన్ తరుపున తాను పనిచేస్తున్నట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలిపారు.

మాస్కోకు తూర్పున 400 కి.మీ దూరంలో ఉన్న నిజ్నీ నొవ్‌గోరోడ్ ప్రాంతంలోని ఒక గ్రామంలో ప్రిలెపిన్ కు చెందిన ఆడి క్యూ7 కారు పేల్చివేయబడింది. దీనిని ఉగ్రవాద చర్యగా పరిగణిస్తున్నట్లు రష్యా స్టేట్ ఇన్వెస్టిగేటివ్ కమిటీ తెలిపింది. ప్రిలెపిన్‌ను ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది. అలెగ్జాండర్ పెర్మియాకోవ్‌గా గుర్తించబడిన అనుమానితుడిని పరిశోధకులు ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిజ్నీ నొవ్‌గోరోడ్ రీజియన్ గవర్నర్ గ్లెబ్ నికితిన్ టెలిగ్రామ్‌లో మాట్లాడుతూ ప్రిలెపిన్‌కు వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారని, ప్రస్తుతం కోలుకుంటున్నాడని వెల్లడించారు.

Read Also: Maoist: జగిత్యాలలో మావోయుస్టుల వార్నింగ్‌ లెటర్‌.. కొత్తగూడెంలో భారీ ఎన్‌కౌంటర్..

ప్రిలేపిన్ టెలిగ్రామ్ ఛానెల్ తో పాటు సొంత వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెళ్లు ఉన్నాయి. 3 లక్షల కన్నా ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన రష్యా-ఉక్రెయిన్ యుద్దానికి బలమైన మద్దతుదారుగా ఉన్నారు. యుద్ధానికి మద్దతుగా పలుమార్లు సోషల్ మీడియాలో పోస్టులు చేశాడు. ఈ యుద్ధానికి ముందు ఆయన తూర్పు ఉక్రెయిన్ లోని డాన్ బాస్ ప్రాంతంలో రష్యాన్ ప్రాక్సీ దళాల తరుపున పోరాడు. సైనిక విభాగానికి నాయకత్వం వహించాడు.

ఇదిలా ఉంటే ప్రిలేపిన్ పై జరిగిన దాడికి అమెరికా, ఉక్రెయిన్ పనే అని రష్యా ఆరోపించింది. అమెరికా మద్దతుతోనే ఉక్రెయిన్ ఇలాంటి దాడులు చేస్తోందని ఆరోపించింది. మూడు రోజుల క్రితం అధ్యక్ష నివాసంపై పుతిన్ ను చంపేందుకు డ్రోన్ దాడి జరిగింది. దాడి చేయడానికి వచ్చిన డ్రోన్లను రష్యన్ బలగాలు కూల్చేశాయి. ఈ దాడికి కారణం ఉక్రెయిన్ అని రష్యా ఆరోపించింది. రష్యా బదులు తీర్చుకుంటానని హెచ్చరించింది. అయితే రష్యా ఆరోపణల్ని అమెరికా, ఉక్రెయిన్ తోసిపుచ్చాయి.

Show comments