రిషి సునాక్.. ఇప్పుడు పరిచయం అక్కర్లేని పేరు.. బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్ తన భార్య, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తి గురించి అనేక విషయాలు వెల్లడించారు. వారి తొలి పరిచయం, ఆమె వ్యవహార శైలి, కుటుంబ బాధ్యతలు, పెళ్లి నాటి విషయాలు.. మనసులోని మాటల్ని బయటపెట్టారు. తనకు, భార్య అక్షత మూర్తికి మధ్య తేడా వివరించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు వెల్లడించారు.
బ్రిటన్ ప్రధాని రేసులో నిలిచిన భారత సంతతి రాజకీయనేత రిషి సునాక్ వెనుక ఎంతో కథ వుంది. తనకు, తన భార్య అక్షత మూర్తికి గల తేడాలను రిషి సునాక్ వివరించారు. తాను ఎంతో ఒద్దికగా ఉంటానని, కానీ అక్షత మూర్తి గజిబిజి గందరగోళం మనిషి అని వివరించారు. తాను పక్కా ప్లాన్ తో ముందుకెళ్ళాలని భావిస్తానని, అయితే తాను మాత్రం అలా వుండదన్నారు.
తాను ప్రతిదీ పక్కాగా ప్రణాళికతో ఉండేలా చూసుకుంటానని, కానీ అక్షత మూర్తి అప్పటికప్పుడు అనుకుని చేసేస్తుంటుందని వెల్లడించారు. ఇంటిని చక్కగా ఉంచే విషయంలో ఆమె గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిదని, ఈ విషయం చెబుతున్నందుకు ఆమె తనను ఎంతగా తిట్టుకుంటుందో తనకు తెలుసని రిషి సునాక్ చమత్కరించారు.
“ఇంటినిండా చిందరవందరగా బట్టలు, ఎక్కడిపడితే అక్కడ బూట్లు… దేవుడా!” అంటూ భార్యను గుర్తుచేసుకుని తలపట్టుకున్నారు. అయితే, తామిద్దరం ఇలా పరస్పరం భిన్నమైన వ్యక్తులం కావడం వల్లే తమ ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందని భావిస్తున్నట్టు సునాక్ అభిప్రాయపడ్డారు. రిషి సునాక్ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తుండగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, సుధామూర్తి దంపతుల కుమార్తె అక్షత మూర్తి పరిచయం అయింది. ఈ జోడీ 2006లో బెంగళూరులో పెళ్లితో ఒక్కటైంది. వీరికి కృష్ణ (11), అనౌష్క (9) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన స్వంత బిజినెస్ నడిపే సమయంలో పిల్లలిద్దరూ పుట్టడంతో వారితో ఎక్కువ సేపు గడిపానన్నారు రిషి సునాక్.
Ys Sharmila: నేడు గవర్నర్ తో వైఎస్ షర్మిల భేటి..! పలు అంశాలపై ఫిర్యాదు?
