NTV Telugu Site icon

Bangladesh: హిందూ నేతలని కలిసిన బంగ్లా తాత్కాలిక అధినేత మహమ్మద్ యూనస్..

Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదే‌శ్‌లో రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా ఎగిసిపడిన ఆందోళనలు తీవ్ర హింసకు దారి తీశాయి. ఈ ఆందోళన కారణంగా, ఆర్మీ అల్టిమేటం కారణంగా షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయి వచ్చారు. ఆమె రాజీనామా తర్వాత దేశవ్యాప్తంగా మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు జరిగాయి. హిందువుల ఇళ్లను, వ్యాపారాలను తగలబెట్టడంతో పాటు ఆలయాలపై దాడులు జరిగాయి. పలు ప్రాంతాల్లో హిందూ మహిళలపై అకృత్యాలకు పాల్పడ్డారు.

ఇదిలా ఉంటే, తనపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో హిందువులు సంఘటితమయ్యారు. రాజధాని ఢాకాతో పాటు పలు ప్రాంతాల్లో స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఈ నేపధ్యంతో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహమ్మద్ యూనస్ ఈ రోజు హిందూ నాయకులను కలుసుకున్నారు. మంగళవారం ఢాకాలోని ఢాకేశ్వరి జాతీయ ఆలయాన్ని సందర్శించిన తర్వాత ప్రజలు ఓపికతో మెలగాలని, ఐక్యత కోసం పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరికి మతంతో సంబంధం లేకుండా హక్కులు ఉన్నాయని అన్నారు.

Read Also: Ear buds: ఇయర్‌బడ్స్ చాలా సమయం వినియోగిస్తున్నారా..? డబ్ల్యూహెచ్వో హెచ్చరిక

బంగ్లాదేశ్ పూజ ఉద్జపన్ పరిషత్ మరియు మహానగర్ సర్బజనిన్ పూజా కమిటీ నాయకులతో సహా హిందూ సమూహాల ప్రతినిధులను కలిసిన యూనస్ మనందరికి ఒకే రకమైన హక్కులు ఉన్నాయని అన్నారు. మన మధ్య ఎలాంటి విభేదాలు సృష్టించొద్దని, దయచేసి ఓపిక పట్టాలని, తాము చేయగలిగినదంతా చేస్తామని, ఒక వేళ ఫెయిల్ అయితే అప్పుడు తమను విమర్శించొచ్చని చెప్పారు. మన ప్రజాస్వామ్య ఆకాంక్షల్లో మనల్ని ముస్లింలు, హిందువులు, బౌద్ధులుగా చూడకూడదని ఆయన అన్నారు.

ఇటీవల మైనారిటీల రక్షణ కోసం యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులపై దాడుల్ని హేయమైనవిగా వర్ణించారు. వారు ఈ దేశ ప్రజలు కాదా.. మీరు(విద్యార్థులు) ఈ దేశాన్ని రక్షించగలిగినప్పుడు, మీరు కొన్ని కుటుంబాలను రక్షించలేరా… వారు మన సోదరులు, కలిసి పోరాడాము, కలిసి ఉంటాము అని అన్నారు.

Show comments