Site icon NTV Telugu

Resomation: నీటిలో అంత్యక్రియలు.. పలు దేశాల్లో వినియోగం.. ఇప్పుడు బ్రిటన్‌లో అందుబాటులోకి

Resomation

Resomation

Resomation: చనిపోయిన తర్వాత భౌతికకాయానికి మత సంప్రదాయాలను అనుసరించి ఖననం, దహనం చేయడం చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ పద్దతితో దహనసంస్కారాలు నిర్వహిస్తున్నారు. చాలా దేశాల్లో కూడా ఇదే తరహా దహనసంస్కారాలు అమలులో ఉన్నాయి. అయితే ‘నీటిలో అంత్యక్రియలు(Water Cremation)’ నిర్వహించే పద్ధతిని కొన్ని దేశాలు అమలు చేస్తున్నాయి. రిసోమేషన్ అనే పిలువబడే ఈ ప్రక్రియ ఇప్పటికే కొన్ని దేశాల్లో అమలులో ఉంది. తాజాగా బ్రిటన్ కూడా ఈ తరహా పద్దతికి అనుమతి ఇచ్చింది. ఈ రిసోమేషన్(Resomation) త్వరలోనే బ్రిటన్ లో అందుబాటులోకి రానుంది.

Read Also: Jagdeep Dhankhar: యూనిఫాం సివిల్ కోడ్ తీసుకువచ్చే సమయం వచ్చింది.. ఉప రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..

అసలేంటి ఈ రిసోమేషన్.. ఏయే దేశాల్లో అమలులో ఉంది..?

నీటి సహాయంతో అంత్యక్రియలు నిర్వహించే పద్దతిని రిసోమేషన్ అని పిలుస్తారు. దీనిలో ఎటువంటి మంట ఉండదు. పోటాషియం హైడ్రాక్సైడ్, నీటి సహాయంతో మృతదేహాన్ని విచ్ఛిన్నం చేసే ప్రక్రియ ఇది. తొలుత మృతదేహాన్ని ఓ బయోడీగ్రేడబుల్‌ బ్యాగులో చుట్టి పెడతారు. అనంతరం 95శాతం నీరు, ఐదు శాతం పొటాషియం హైడ్రాక్సైడ్‌తో కూడిన వేడి ద్రావణమున్న కంటైనర్‌లో ఉంచుతారు. దీన్నే ‘బాయిల్‌ ఇన్‌ ది బ్యాగ్‌’గా వ్యవహరిస్తారు. రసాయన చర్య అనంతరం కొన్ని ద్రవాలు బయటకు రాగా.. మిగిలిపోయిన ఎముకలను పొడి చేసి మృతుల బంధువులకు అప్పగిస్తారు. ఈ పద్ధతి పూర్తికావడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ఎటువంటి గాలి కాలుష్య కారకాలు, విషపూరిత వాయువులూ వెలువడవు. అక్వామేషన్, ఆల్కలైన్, హైడ్రాసిస్ అని కూడా పిలిచే ఈ ప్రక్రియను అత్యంత సురక్షితమని పరిశోధకులు చెబుతున్నారు.

ఇప్పటికే ఈ విధానాన్ని కెనడా, దక్షిణాఫ్రికా, అమెరికాలోని పలు రాష్ట్రాల్లో వినియోగిస్తున్నారు. తాజాగా బ్రిటన్ కూడా ఈ పద్ధతికి ఆమోద ముద్ర వేసింది. సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే మూడోవంతు తక్కువగా ఉద్గారాలు విడుదల అవుతాయని బ్రిటన్‌కు చెందిన ‘కో-ఆప్‌ ఫ్యూనెరల్‌ కేర్‌’ అనే అంత్యక్రియలు నిర్వహించే సంస్థ వెల్లడించింది. దీనికి అయ్యే ఖర్చు కూడా సంప్రదాయ పద్ధతుల్లో అంత్యక్రియల మాదిరిగానే ఉంటుందని తెలిపింది. సాధారణంగా ఒక దహన ప్రక్రియాలో దాదాపుగా 245 కిలోల కార్బన్ విడుదల అవుతుంది. ఇలా బ్రిటన్ దహన సంస్కారాల్లో వందట టన్నుల వాయువులు విడుదల అవుతున్నట్లు సీడీఎస్ అనే సంస్థ వెల్లడించింది. మరోవైపు ఈ విధానాన్ని ప్రస్తుతం కొన్నిచోట్ల ప్రారంభిస్తున్నామని.. మరికొన్ని రోజుల్లోనే బ్రిటన్‌ వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు ‘కో-ఆప్‌ ఫ్యూనెరల్‌ కేర్‌’ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న సంప్రదాయ పద్ధతులైన దహన, ఖనన విధానాలకు ప్రత్యామ్నాయం ఇదేనని పేర్కొంటున్నారు.

Exit mobile version