Plastic Currency Trend: కరెన్సీ అంటే ప్రేమ లేనిది ఎవరికి.. ప్రతి ఒక్కరి జీవితాలను మార్చే శక్తిని సొంతం చేసుకున్న ఈ నోట్ల కట్టలు ఇకపై చరిత్ర పుట్టల్లో భాగం కానున్నాయని తెలుస్తుంది. దీనికి బ్యాంక్ వర్గాలు కూడా అవుననే చెబుతున్నాయి. దేశంలో వేగంగా పెరుగుతున్న నగదు డిమాండ్‌ను తట్టుకోవడంతో పాటు, నకిలీ నోట్ల ముఠాలకు చెక్ పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక విప్లవాత్మక అడుగు వేయడానికి రెడీ అవుతుందని సమాచారం. ఇకపై సాంప్రదాయ కాగితపు నోట్లకు గుడ్ బై చెప్పి.. వాటి స్థానంలో అత్యంత మన్నికైన ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లను ముద్రించే అంశాన్ని ఆర్‌బీఐ తీవ్రంగా పరిశీలిస్తోందట. ఇటీవల పాట్నా, ముంబైలలో జరిగిన ఆర్‌బీఐ బోర్డు సమావేశాలలో ఈ మార్పుపై క్షుణ్ణంగా చర్చలు జరిగినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. వాస్తవానికి ప్రపంచ దేశాల్లో ఇప్పటికే ఈ ప్లాస్టిక్ నోట్లు చలామణిలో ఉన్నాయి. ఏయే దేశాల్లో ఈ ప్లాస్టిక్ కరెన్సీ వాడుకలో ఉందో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
పూర్తిగా ప్లాస్టిక్ నోట్లు చలామణి అవుతున్న 6 దేశాలు..
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 దేశాలు ప్లాస్టిక్ నోట్లను పాక్షికంగా వాడుతున్నప్పటికీ, కొన్ని దేశాలు మాత్రం తమ ఆర్థిక వ్యవస్థ నుంచి కాగితపు నోట్లను పూర్తిగా తుడిచేసి, వంద శాతం పాలిమర్ కరెన్సీని వాడుతున్నాయి. ఆ దేశాలు ఏవి అంటే..
ఆస్ట్రేలియా: 1988లోనే పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టిన ప్రపంచపు మొట్టమొదటి దేశం ఆస్ట్రేలియా. ప్రస్తుతం ప్రపంచంలో ఈ నోట్లను ఉత్పత్తి చేస్తున్న ఏకైక దేశం కూడా ఇదే.
న్యూజిలాండ్: ఈ దేశం 1999లోనే తన కాగితపు కరెన్సీ మొత్తాన్ని చలామణి నుంచి తొలగించింది. ఇక్కడ $5 నుంచి $100 వరకు అన్నీ ప్లాస్టిక్ నోట్లే చలామణిలో ఉన్నాయి.
బ్రూనై: ఆగ్నేయాసియాలోని ఈ సంపన్న దేశం నకిలీ నోట్ల ముప్పును పూర్తిగా నిర్మూలించడానికి ప్లాస్టిక్ నోట్లను స్వీకరించింది.
వియత్నాం: 2003లో వియత్నాం పాలిమర్ నోట్లను దేశంలో ప్రవేశపెట్టారు. ఇక్కడి కరెన్సీ ‘డాంగ్’ పూర్తిగా ప్లాస్టిక్‌తోనే తయారవుతుంది.
రొమేనియా: 2005లో రొమేనియా దేశంలోని అన్ని నోట్లను పాలిమర్‌గా మార్చిన ఏకైక యూరోపియన్ దేశంగా రికార్డు సృష్టించింది.
పపువా న్యూ గినియా: 1975 తర్వాత ‘కినా’ అనే సరికొత్త ప్లాస్టిక్ కరెన్సీని ఈ దేశం వాడుకలోకి తీసుకొచ్చింది. (జీ-7 శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా ఈ దేశాన్ని సందర్శిస్తుండటం గమనార్హం).
ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కరెన్సీకి పెరుగుతున్న క్రేజ్.. కానీ
ప్రస్తుతం సింగపూర్, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, కెనడా వంటి దాదాపు 60 దేశాల్లో ఈ సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీ అయిన అమెరికా డాలర్ ($) మాత్రం ఇప్పటికీ పూర్తిగా ప్లాస్టిక్‌తో తయారు కాకపోవడం విశేషం. అమెరికా తన కరెన్సీని పత్తి (Cotton), నారల (Linen) ప్రత్యేక మిశ్రమంతో తయారు చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచ ధోరణిని బట్టి చూస్తే.. త్వరలోనే భారత కరెన్సీ ‘రూపాయి’ కూడా సరికొత్త ప్లాస్టిక్ రూపంలో మన జేబుల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్లాస్టిక్ నోట్ల ప్రత్యేకత ఇదే..
కాగితపు నోట్లను దశలవారీగా తొలగించి, ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడానికి ప్రధాన కారణాలు.. వాటి తక్కువ ఖర్చు, ఎక్కువ మన్నిక అనే చెబుతున్నారు. సాధారణ కాగితపు నోట్ల కంటే ప్లాస్టిక్ నోట్లు సుమారు రెండున్నర రెట్లు ఎక్కువ కాలం చలామణిలో ఉండగలవని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ నోట్లు నీరు, తేమ, మురికిని సులభంగా తట్టుకోవడం పెద్ద ప్లస్ అని అంటున్నారు. పొరపాటున జేబులో ఉంచి నీటిలో నానబెట్టినా లేదా వాషింగ్ మెషిన్‌లో వేసినా ఇవి అస్సలు పాడవ్వవు. అలాగే ఈ నోట్లు అంత తేలిగ్గా చిరగవు. దీనివల్ల పదేపదే కొత్త నోట్లు ముద్రించే ఖర్చు ప్రభుత్వానికి తప్పుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా, ప్లాస్టిక్ నోట్లను నకిలీ చేయడం లేదా కాపీ కొట్టడం ఎవరికీ సాధ్యం కాదని చెబుతున్నారు. ఇన్ని ప్రత్యేకతలు ఉండటంతో ఆర్‌బీఐ కూడా ఈ ప్లాస్టిక్ నోట్లను దేశంలో ప్రవేశ పెట్టాలని భావిస్తుందని చెబుతున్నారు.
