Hormuz Strait Crisis: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూస్ జలసంధి సంక్షోభం మరింత తీవ్రతరమవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించి, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఖతార్ కీలకంగా రంగంలోకి దిగినట్లు అంతర్జాతీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సమాచారం ప్రకారం, అమెరికా ఆంక్షల సడలింపు.. ఇరాన్‌కు సంబంధించిన స్తంభింపజేసిన ఆస్తుల అంశాలపై చర్చలు జరిపేందుకు ఖతార్ ఒక మధ్యవర్తుల బృందాన్ని టెహ్రాన్‌కు పంపింది. ఈ చర్చల్లో భాగంగా 30 రోజుల చర్చల ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇరాన్ అణు కార్యక్రమంపై కూడా తదుపరి చర్చలు జరిగే అవకాశం ఉందని సమాచారం.
ఇప్పటి వరకు అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న రహస్య దౌత్య చర్చల్లో పాకిస్తాన్, ఓమన్ ప్రధాన పాత్ర పోషించగా, ఇప్పుడు ఖతార్ ప్రత్యక్షంగా రంగంలోకి రావడం అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఇదే సమయంలో పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ టెహ్రాన్‌లో ఉన్నట్లు సమాచారం. అలాగే పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్.. చైనా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఏదైనా భవిష్యత్తు ఒప్పందంలో చైనాను హామీదారుగా తీసుకురావాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై టోల్ పన్ను విధించేందుకు ఇరాన్ రూపొందించిన ప్రణాళిక మరో వివాదానికి దారితీసింది. ఇరాన్ ఏర్పాటు చేసిన “పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ” ద్వారా సముద్ర రవాణాపై నియంత్రణ సాధించి రుసుములు వసూలు చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ చర్యకు గల్ఫ్ దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. Saudi Arabia, United Arab Emirates, Bahrain, Kuwait మరియు ఖతార్ కలిసి అంతర్జాతీయ సముద్రయాన సంస్థకు సంయుక్త లేఖ రాసినట్లు సమాచారం. అంతర్జాతీయ జలమార్గాలపై నియంత్రణ సాధించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని ఆ లేఖలో హెచ్చరించారు.
మరోవైపు అమెరికా కూడా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. అమెరికా మీడియా కథనాల ప్రకారం, డొనాల్డ్ ట్రంప్ పరిపాలన ఇరాన్‌పై మరో సైనిక చర్యను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ట్రంప్ తన వ్యక్తిగత కార్యక్రమాలను కూడా రద్దు చేసుకుని వరుసగా భద్రతా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇరాన్ ప్రస్తుతం కాల్పుల విరమణ, ఆంక్షల సడలింపు, భవిష్యత్తులో దాడులు జరగవన్న హామీలను కోరుతోంది. అదే సమయంలో అమెరికా మరియు దాని మిత్రదేశాలు ముందుగా హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని, అలాగే అణు కార్యక్రమంపై రాజీ పడాలని టెహ్రాన్‌పై ఒత్తిడి తెస్తున్నాయి. అయితే, హార్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు చమురు ఎగుమతులపై అధికంగా ఆధారపడటంతో ఈ సంక్షోభం వారిలో తీవ్ర ఆందోళనకు కారణమవుతోన్న విషయం విదితమే..
