Putin Says Ready For Talks With Ukraine: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పడాలని ప్రపంచదేశాలు కాంక్షిస్తున్నాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య మాత్రం యుద్ధం ఆగడం లేదు. రష్యా దాడులతో ఉక్రెయిన్ సర్వనాశనం అవుతోంది. ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ చర్చలకు సిద్ధం అని ఎలాంటి సంకేతాలు పంపడం లేదు. ఇదిలా ఉంటే రష్యా మాత్రం ఉక్రెయిన్ తో చర్చలకు సిద్ధం అని పలుమార్లు ప్రకటించింది. అయితే రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఉన్నంత కాలం రష్యాతో చర్చల ప్రసక్తే లేదని గతంలో జెలన్స్కీ చెప్పారు.
Read Also: Tragedy: పశ్చిమ బెంగాల్లో విషాదం.. తల్లి శవాన్ని 50కి.మీ. మోసిన కొడుకు
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ పై రష్యా యుద్దం ప్రారంభం అయి ఇప్పటికీ 316 రోజులు గడుస్తోంది. అయితే ఇప్పటికే రష్యా తరుపున క్రెమ్లిన్ అధికార ప్రతినిధి కూడా ఉక్రెయిన్ కు చర్చల ప్రతిపాదన చేశారు. ఇదిలా ఉంటే తాజాగా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ చర్చలకు సిద్ధమే అని ప్రకటించారు. అయితే దానికి ఓ షరతు విధించారు. రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ భాగాలపై పట్టుపట్టకుంటేనే చర్చలు అని తేల్చి చెప్పారు పుతిన్. ఈ విషయాన్ని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తో పుతిన్ చెప్పినట్లు రష్యా అధికార వర్గాలు వెల్లడించాయి.
రష్యా 2014లో ఉక్రెయిన్ భూభాగం అయిన క్రిమియాను ఆక్రమించుకుంది. తాజాగా ఈ యుద్ధ సమయంలో డొనెట్స్క్, లుగాన్స్క్, జపోరిజ్జియా మరియు ఖెర్సన్ ప్రాంతాలను పూర్తిగా ఆక్రమించుకుని రష్యాలో కలుపుకున్నట్లు ప్రకటించింది. మరోవైపు అమెరికా వెనక నుంచి ఉక్రెయిన్ ను ఎగదోస్తోందని రష్యా ఆరోపిస్తోంది. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీకి అక్కడ ఘనస్వాగతం లభించింది. అమెరికా నుంచి భారీగా ఆర్థిక సహాయంతో పాటు అత్యంత కీలకమైన పెట్రియాట్ వ్యవస్థను ఉక్రెయిన్ కు ఇస్తోంది. దీనిపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేేస్తోంది.
