Putin: ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ రష్యా వెలుపల ఇతర దేశాల పర్యటనలకు వెళ్తున్నాడు. ఇటీవల కిర్గిజ్‌స్తాన్ లో జరిగిన ఓ సమావేశానికి హాజరైన వ్లాదిమిర్ పుతిన్ తాజాగా చైనా పర్యటనకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయనకు చైనా ఘనస్వాగతం పలికింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధినేత పుతిన్ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు.
గత దశాబ్ధకాలంలో తాను పుతిన్ ను 42 సార్లు కలిశానని, మంచి స్నేహాన్ని పెంచుకున్నానని జిన్ పింగ్ అన్నారు. పుతిన్ తో తనకున్న సన్నిహిత సంబంధాలను ప్రశంసించారు. చైనా, రష్యాల మధ్య రాజకీయ, ఆర్థిక సంబంధాలను మరింత పెంపొందించుకోవాలని ఇరుదేశాధి నేతలు భావిస్తున్నారు. రెండు దేశాల మధ్య రాజకీయ పరస్పర విశ్వాసం నిరంతరం పెరుగుతోందని జిన్‌పింగ్ అన్నారని జిన్హూవా వార్త సంస్థ తెలిపింది.
Read Also: NewsClick Case : హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన ప్రబీర్ పుర్కాయస్థ
చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ అండ్ రోడ్ ఇనియేటివ్(బీఆర్ఐ) ఫోరంలో పాల్గొనేందుకు పుతిన్ చైనా రాజధాని బీజింగ్ వెళ్లారు. బీఆర్ఐ పనితీరును పుతిన్ కొనియాడారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పుతిన్ తొలిసారిగా చైనాను సందర్శించారు. యుద్ధం తర్వాత పుతిన్ సందర్శించిన రెండో దేశం చైనా.
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా అకృత్యాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర పాటుగా పుతిన్ రష్యాను వదిలి వెళ్లలేదు. రష్యా సభ్యదేశంగా ఉన్న బ్రిక్స్, జీ20 సదస్సులకు ఆయన హాజరుకాలేదు. ఆయన స్థానంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీలావ్రోవ్ పాల్గొన్నారు.