NTV Telugu Site icon

Vladimir Putin: అలా చేస్తే ప్రతీకారం తప్పదు..ఫిన్లాండ్, స్వీడన్లకు వార్నింగ్

Putin

Putin

స్వీడన్, ఫిన్లాండ్ నాటో కూటమిలో చేరబోతున్నాయి. అందుకు ప్రక్రియ ప్రారంభం అయింది. అయితే ఈ విషయంపై మొదటి నుంచి రష్యా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గతంలో రష్యా ఈ విషయమై స్వీడన్, ఫిన్లాండ్లకు వార్నింగ్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఈ రెండు దేశాలు నాటో కూటమిలో చేరడంపై రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. తర్కమెనిస్థాన్ రాజధాని అష్గాబాత్ లో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఉక్రెయిన్ మాదిరిగా రష్యాకు స్వీడన్, ఫిన్లాండ్ తో ఎలాంటి సమస్యలు లేవని ఆయన అన్నారు.  ఈ రెండు దేశాలతో ప్రాదేశిక వివాదాలు లేవని పుతిన్ అన్నారు. స్వీడన్,  ఫిన్లాండ్ దేశాలు నాటోలో చేరడంపై రష్యాకు అభ్యంతరం లేదని. వారు కోరుకుంటే చేరవచ్చని.. అది వారి ఇష్టమని అన్నారు.

అయితే స్వీడన్, ఫిన్లాండ్ దేశాల ఓ హెచ్చరిక జారీ చేశారు పుతిన్. సైనిక మౌళిక సదుపాయాలను ఈ దేశాల్లో మోహరించినట్లయితే ఖచ్చితంగా రష్యా నుంచి ప్రతిస్పందన ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. మాకు బెదిరింపులు తలెత్తితే  పర్యవసనాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.

ఫిబ్రవరి 24న నాటో, వెస్ట్రన్ అనుకూల ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యను ప్రారంభించింది. దీంతో స్వీడన్, ఫిన్లాండ్ రెండూ నాటోలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. బుధవారం మాడ్రిడ్ లో జరిగిన నాటో సదస్సులో సభ్యత్వం కోసం అధికారిక ప్రక్రియ ప్రారంభం అయింది. అయితే గతంలో ఈ రెండు దేశాలు నాటో చేరడాన్ని అంతర్జాతీయ భద్రతను అస్థిర పరిచే అంశంగా రష్యా పేర్కొంది. నాటో సామ్రాజ్య ఆశయాలను పుతిన్ ఖండిచారు. ఉక్రెయిన్ దేశాన్ని వాడుకుని నాటో కూటమి తమ ఆధిపత్యాన్ని చూపించాలనుకుంటుందని విమర్శించారు.