NTV Telugu Site icon

Bangladesh: “ఉర్దూ, జిన్నా” వైపు బంగ్లాదేశ్ అడుగులు.. స్వాతంత్య్ర లక్ష్యాలని మరిచిపోతున్నారు..

Bangladesh

Bangladesh

Bangladesh: ఒకప్పుడు దాయాది దేశం పాకిస్తాన్‌లో అంతర్భాగంగా ఉన్న బంగ్లాదేశ్(అప్పటి తూర్పు పాకిస్తాన్) ఏ లక్ష్యం కోసం స్వాతంత్య్రాన్ని తెచ్చుకుందో ఇప్పుడు ఆ లక్ష్యం మరుగునపడిపోతోంది. అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు మహ్మద్ అలీ జిన్నా, బెంగాలీ మాట్లాడే ప్రజలపై ఉర్దూ భాషను రద్దాలని చూడటమే బంగ్లాదేశ్ ఏర్పాటుకు మూలమైంది. అయితే, ఇప్పుడు షేక్ హసీనా దిగిపోయిన తర్వాత అక్కడ రాడికల్ ఇస్లామిస్టుల రాజ్యం నడుస్తోంది. జమాతే ఇస్లామీ వంటి మతఛాందస వాద సంస్థలకు కొత్త ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వడంతో పాటు పలువురు ఉగ్రవాద నేతల్ని జైలు నుంచి విడుదల చేయడం ఆందోళన కలిగిస్తోంది.

అయితే, తన ప్రత్యేకతను మరిచిన బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్‌గా మారేందుకు వడివడిగా పరుగులు తీస్తోంది. మహ్మద్ అలీ జిన్నాను విలన్‌గా చూసే రోజుల నుంచి అతడి వర్ధంతిని ఘనంగా జరుపుకునే స్థాయికి బంగ్లాదేశ్ చేరుకుంది. అనేక మంది బెంగాలీల ఊచకోతకు కారణమైన వ్యక్తిని పొగుడుతూ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ మద్దతు కలిగిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ), జమాతే ఇస్లామీ వంటి సంస్థలు విద్యార్థి ఉద్యమాన్ని హైజాక్ చేసి, ఇప్పుడు లౌకిక దేశంగా ఉన్న బంగ్లాని, ఇస్లామిక్ దేశంగా మార్చాలని భావిస్తున్నాయి.

ఇటీవల జిన్నా 76వ వర్ధంతి సందర్భంగా ఢాకాలో ఉర్దూ కవిత్వం, పాటలతో ఓ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. బంగ్లాదేశ్ చరిత్రలో జిన్నా వర్ధంతిని ఢాకాలో నిర్వహించడం ఇదే తొలిసారి. జిన్నా లేకుంటే బంగ్లాదేశ్ ఉనికే లేదని ఈ కార్యక్రమానికి హాజరైన వారు తెగ పొగిడారు. బెంగాలీని కాదని ఉర్దూని ప్రేమించడం, జిన్నాని అభిమానించడం అక్కడి పాక్ మద్దతుదారులకు, ఇస్లామిక్ శక్తులకు సంతోషం కలిగిస్తుంటే, స్వాతంత్య్రం కోసం ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలు మాత్రం 1971 నాటి నెత్తుటి జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నాయి.

Read Also: Telangana Liberation Day : తెలంగాణ విమోచన దినోత్సవ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్

ఢాకా ప్రెస్ క్లబ్‌లో ఘనంగా జిన్నా వర్ధంతి వేడుకలు:

షేక్ హసీనా అధికారంలో ఉన్న సమయంలో జిన్నా అనే పేరు కానీ, ఉర్దూ అనే పేరు కానీ వినబడేది కాదు. మైనారిటీలపై దాడులు జరిగేవి కాదు. కానీ ఇప్పుడు అక్కడ అంతా రివర్స్ అయింది. ఢాకా ప్రెస్ క్లబ్‌లో ఘనంగా జిన్నా వర్ధంతి వేడకలు నిర్వహించారు. తోఫజల్ హుస్సేన్ మానిక్ మియా హాల్‌లో నవాబ్ సలీముల్లా అకాడెమీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు జిన్నా లేకుంటే “బంగ్లాదేశ్ కూడా ఉనికిలో ఉండదు” అని పేర్కొంటూ పాకిస్తాన్ ఏర్పాటులో జిన్నా యొక్క కీలక పాత్రను నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ హైకమిషనర్ హాజరుకావల్సి ఉన్నా, అతను గైర్హాజరు కావడంతో అతడికి బదులుగా డిప్యూటీ హైకమీషనర్ కమ్రాన్ ధంగల్ పాకిస్తాన్‌కి ప్రాతినిధ్యం వహించారు.

1952లో తూర్పు పాకిస్తాన్(ఇప్పటి బంగ్లాదేశ్)పై ఉర్దూని బలవంతంగా రుద్దారు. ప్రభుత్వం, విద్య, మీడియా, కరెన్సీ, స్టాంపులపై ఉర్దూని బలవంతం చేయడం ప్రారంభించారు. దీంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. బెంగాలీ భాష కోసం పోరాటం మొదలైంది. ఈ ఉద్యమంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ కార్యక్రమానికి హాజరైన ఎండీ సంసుద్దీన్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ లేకుండా బంగ్లాదేశ్ ఉండేది కాదని అన్నారు. బంగ్లాదేశ్ కూడా కాశ్మీర్ లాగా తయారయ్యేదని, భారత్ మన మెడపై ఆయుధాలను ఉంచేదని వివాదాస్పద ప్రకటన చేశాడు. బంగ్లాదేశ్‌కి అంతిమంగా స్వాతంత్య్రం రావడంతో పాకిస్తాన్ ఏర్పాటుకు కారణమైన జిన్నా కృషిని ప్రశంసించాడు.

ఢాకా యూనివర్సిటలో ‘‘అల్లామా ఇక్బాల్ హాల్ లేదా జిన్నా ఎవెన్యూ’’ వంటి పేర్లను తొలగించడంలో బంగ్లాదేశ్ ప్రమేయం లేదని, ఇది న్యూఢిల్లీ ఆసక్తి అని ఆరోపించాడు. మరో వక్త నజ్రుల్ ఇస్లాం కూడా ఇదే వైఖరిని సమర్ధించాడు. జిన్నా మన జాతి పితామహుడు, కానీ మనం దానిని గుర్తించలేదు, పాకిస్తాన్‌తో మన సోదరభావాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చాడు.

అయితే, ఈ కార్యక్రమాన్ని జాతీయవాద బంగ్లాదేశీలు విమర్శిస్తున్నారు. జర్నలిస్ట్ సలాఉద్దీన్ షోయబ్ చౌదరి స్పందిస్తూ.. 30 లక్షల మంది బెంగాలీలు తమ ప్రాణాలను త్యాగం చేసిన స్వాతంత్య్రానికి ఇది చెప్పదెబ్బగా అభివర్ణించారు. బంగ్లాదేశ్ తన చరిత్రను తిరగ రాస్తోందా.. అని ఇస్లామాబాద్‌కి చెందిన విశ్లేషకుడు అష్ఫాక్ హసన్ ప్రశ్నించారు.