జపాన్ మాజీ ప్రధాని షింజో అబేహత్యకు గురికావడంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి చెందాయి. ఈ నేపథ్యంలో అబేకు భద్రత కల్పించడంలో పోలీసుల వైఫల్యం ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అబె ప్రసంగిస్తున్నప్పుడు ఆయన వెనకనున్న ఖాళీ ప్రదేశంపై భద్రత బలగాలు తగినంత దృష్టి సారించలేదని విశ్లేషకులు చెబుతున్నారు. నారాలో నగరంలో సభకు వెళ్లాలని కేవలం ఒకరోజు ముందుగా నిర్ణయించడం, ప్రచార వాహనం పైభాగం నుంచి కాకుండా నేలపై నిల్చొని మాజీ ప్రధాని ప్రసంగించడం వల్ల సులభంగా బలైపోయారని వారు విశ్లేషిస్తున్నారు. భద్రత సమస్యలను స్థానిక పోలీసు ఉన్నతాధికారి అంగీకరించారు. ఆయన భద్రతా విషయాలకు సంబంధించి కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. మాజీ ప్రధాని షింజో అబే భద్రతకు సంబంధించి కాదనలేని లోపాలు ఉన్నాయని అన్నారు. ఒక దుండగుడు ఆయనకు సమీపంలోకి వచ్చి మరీ కాల్పులు జరపగలిగాడంటే ఆయనకు ఎటువంటి పటిష్టమైన భద్రత ఉందో తెలుస్తోందని చెప్పారు.
హింసాత్మక నేరాలు తక్కువ సంఖ్యలో నమోదయ్యే జపాన్‌లో ఇలాంటి హత్య జరిగిందంటే నమ్మశక్యంగా లేదన్నారు. పైగా కఠినమైన తుపాకి చట్టాలు ఉన్న జపాన్ దేశంలో ఈ ఘటన చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. అంతేకాదు జపాన్‌లో స్థానిక ప్రచార కార్యక్రమాల్లో భద్రత సాపేక్షంగా సడలించబడుతుందని చెప్పారు. ఏదీ ఏమైన ఆయనకు పటిష్టమైన భద్రత లేదని స్పష్టమవుతోందని అన్నారు. తన 27 ఏళ్ల కెరియర్‌లో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొలేదని, ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తానని చెప్పారు. అంతేకాదు మాజీ ప్రధాని అబే రక్షణకు సంబంధించి భద్రతా చర్యల్లో చాలా లోపాలు ఉన్నాయని, ఇది కాదనలేని వాస్తవమని జపాన్ పోలీస్ ఉన్నతాధికారి టోమోకి ఒనిజుకా భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.
Bear Attack : సర్కస్‌లో ఊహించని ఘటన.. ట్రైనర్‌పై బల్లూకం దాడి.. వీడియో
కాల్పుల కారణంగా ఒక తూటా అబె ఎడమ భుజం నుంచి దూసుకుపోయి.. ధమనులను, కాలర్ బోన్స్‌ను తీవ్రంగా దెబ్బతీసిందని శవపరీక్షలో తేలింది. శరీరం నుంచి ఎక్కువ మొత్తంలో రక్తం బయటకు పోయిందని గుర్తించారు. ఒక మాజీ ప్రధానికి కల్పించాల్సిన స్థాయి భద్రత షింజో అబేకు లేదని క్యోటోకు చెందిన ఓ మాజీ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. నిందితుడు అంత స్వేచ్ఛగా అబే వెనకకు ఎలా రాగలిగాడో దర్యాప్తు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
యమగామి తొలి విడత కాల్పులు జరిపినప్పుడు తూటా గురి తప్పింది. ఆ శబ్దం విని ఏమైందో చూసేందుకు అబే వెనక్కి తిరిగారు. అప్పుడు రెండో తూటా ఆయన శరీరంలోకి దూసుకువెళ్లింది. మాజీ ప్రధాని భద్రత సిబ్బందిలో ఒకరు తూటారక్షక బ్రీఫ్‌కేసును పైకెత్తినా అప్పటికే నష్టం జరిగిపోయింది. క్షణాల్లో చికిత్స అందించే ప్రయత్నం జరిగినా ఫలితం లేకపోయింది. ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి క్యోటోలో ఒక గిడ్డంగిలో ఫోర్క్‌లిఫ్ట్ ఆపరేటర్‌గా ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్నాడని, ఎవరితో కలవకుండా మౌనంగా ఉండేవాడని స్థానిక పత్రిక ఒకటి తెలిపింది.