PM Sheikh Hasina on Rohingya issue: రోహింగ్యాలను స్వేదేశానికి వెళ్లేలా సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ దేశాలను కోరారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. రోహింగ్యాల సమస్య ఈ ప్రాంతంలో స్థిరత్వం, భద్రతపై ప్రభావం చూపిస్తోందని శనివారం ఆమె యూఎన్ లో అన్నారు. మయన్మార్ లో కొనసాగుతున్న రాజకీయ హింస, సాయుధపోరాటాలు రోహింగ్యాలను స్వదేశానికి తరలించడాన్ని క్లిష్టతరం చేసిందని ఆమె అన్నారు. ఈ విషయంలో యూఎన్ సమర్థవంతమైన పాత్ర పోషిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
2017నుంచి గత ఐదేళ్లుగా బంగ్లాదేశ్ లోకి రోహింగ్యాల వలసలు కొనసాగుతున్నాయని.. గతంలో మయన్మార్ తో పలు చర్చలు జరిగినప్పటికీ వారిని పంపించలేకపోయామని ఆమె అన్నారు. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ, భద్రత, సామాజిక – రాజకీయ స్థిరత్వంపై రోహింగ్యాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నారని ఆమె యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో తెలిపారు. మానవ రవాణా, మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో సహా అనేక వ్యవస్థీకృత నేరాలు సరిహద్దుల్లో పెరిగాయని షేక్ హసీనా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య వల్ల రాడికలైజేషన్ పెరిగిపోతోందని.. ఇదే జరిగితే ఈ ప్రాంతంలో భద్రత, స్థిరత్వంపై ప్రభావం చూపిస్తుందని అన్నారు.
Read Also: Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. 6.2 తీవ్రతతో కంపించిన భూమి
మయన్మార్ లో ఆ దేశ ప్రజలు, ఆర్మీ నుంచి తీవ్రదాడులు ఎదుర్కొన్న రోహింగ్యా ముస్లింలు పక్కనే ఉన్న బంగ్లాదేశ్ కు వలస వస్తున్నారు. కాక్స్ బజార్ ప్రాంతంలో పెద్ద ఎత్తున నివాసాలు ఏర్పరుచుకోవడంతో పాటు పలు నేరాలకు పాల్పడుతున్నారు. దీంతో బంగ్లాదేశ్ ప్రజల్లో వీరిపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పటికే 10 లక్షలకు పైగా రోహింగ్యాలు బంగ్లాదేశ్ లో శరణార్థులుగా ఉన్నారు. అయితే వీరి నుంచి శాంతిభద్రతల సమస్యలు ఏర్పడటంతో వీరిని బంగాళాఖాతంలోని భాసన్ చార్ ద్వీపానికి తరలించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భావించింది. అయితే హ్యుమన్ రైట్స్ సంస్థల నుంచి విమర్శలు రావడంతో ఈ నిర్ణయాన్ని విరమించుకుంది. రోహింగ్యాల వల్ల బంగ్లా ఆర్థిక వ్యవస్థపై విపరీత భారం పడుతోంది. దీంతో ఆ దేశం ఈ సమస్యను అధిగమించాలని.. రోహింగ్యాలను సొంత దేశం మయన్మార్ కు పంపాలని భావిస్తోంది.
