Gaza Ceasefire-Hostage Deal: ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య సయోధ్య కుదిరింది. అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంతో బందీలను రిలీజ్ చేసేందుకు ఇరు వర్గాల మధ్య ఒప్పందం చివరి దశకు చేరిందని ఇజ్రాయెల్ ప్రధాని మంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు ప్రసారం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందానికి అడ్డుగా మారిన చిక్కులను మధ్యవర్తులు క్రమంగా తొలగించినట్లు తెలిపారు. అలాగే, కేబినెట్ భేటీ తర్వాత ఈ ఒప్పందాన్ని ఆమోదించేందుకు ఇజ్రాయెల్ సర్కార్ భేటీ అవుతుంది. కేబినెట్ ఈ ఒప్పందాన్ని ఆమోదిస్తే.. వచ్చే ఆదివారం నుంచి ఇది అమలులోకి వస్తుంది. బందీల విడుదలకు ప్రతిగా ఇజ్రాయెల్ పాలస్తీనా ఖైదీలను రిలీజ్ చేయనుంది. తర్వాత పూర్తిస్థాయిలో యుద్ధాన్ని ముగించేందుకు నిబంధనలు ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇక, ఈ ఒప్పందం గురించి ఇప్పటికే బందీల కుటుంబాలకు సమాచారం ఇచ్చినట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం పేర్కొనింది.
Read Also: Hyderabad: అఫ్జల్‌గంజ్ కాల్పుల ఘటన.. నిందితుల కోసం 8 ప్రత్యేక బృందాలు గాలింపు!
అయితే, 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడి చేసింది. ఈ ఘటనలో 1200 మందికి పైగా ఇజ్రాయెల్ ప్రజలు చనిపోయారు.. అలాగే, మరో 250 మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా తీసుకెళ్లింది. దీంతో హమాస్‌పై ఇజ్రాయెల్ భీకరమైన దాడులకు దిగింది. హమాస్ అగ్రనేత ఇస్మాయెల్ హనియా, యహ్యా సిన్వార్‌తో పాటు కీలక నేతలను చంపేసింది. గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 46,000 మందికి పైగానే పాలస్తీన ప్రజలు మృతి చెందారు.