NTV Telugu Site icon

PM Modi: కువైట్‌.. మినీ ఇండియాలా ఉంది.. హలా మోడీ ప్రోగ్రామ్‌లో ప్రధాని వ్యాఖ్య

Halamodi

Halamodi

కువైట్ మినీ ఇండియాలా ఉందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోడీ శనివారం కువైట్ చేరుకున్నారు. ఈ సందర్భంగా భారతీయులు ఏర్పాటు చేసిన ‘‘హలా మోడీ’ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. భారత్-కువైట్ మధ్య సంబంధం నాగరికతలకు, సముద్రానికి, వాణిజ్యానికి సంబంధించినది అని తెలిపారు. భారతదేశం, కువైట్ దేశాలు సముద్రం ఒడ్డున ఉన్నాయని చెప్పారు. దౌత్యం ద్వారా మాత్రమే కాకుండా హృదయాలతో కూడా రెండు దేశాలు అనుసంధానించబడినట్లు తెలిపారు. భారత్ నుంచి కువైట్ రావడానికి 4 గంటల సమయం పడితే.. ఓ భారత ప్రధాని కువైట్ రావడానికి 4 దశాబ్దాల కాలం పట్టిందని వివరించారు.

ఇది కూడా చదవండి: HYDRA: హైడ్రాకు అండగా న్యాయ నిపుణులు.. న్యాయ స‌ల‌హాలు అందిస్తామని వెల్లడి

ప్రతి ఏటా వందలాది మంది భారతీయులు కువైట్‌కు వస్తున్నారని, అలా కువైట్‌ సమాజానికి భారతీయతను పరిచయం చేశారని మోడీ కొనియాడారు. భారతదేశ ప్రతిభ, సాంకేతికత, సంప్రదాయాలను మేళవించి కువైట్‌ నేలను భారతీయ నైపుణ్య రంగులతో నింపారని ప్రశంసించారు. ఈ దేశ వైద్యరంగానికి భారతీయ వైద్యులు, పారామెడికో సిబ్బందే ప్రధాన బలమన్నారు. కువైట్‌ భవిష్యత్‌ తరాలను తీర్చిదిద్దడంలో భారతీయ ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా మారిందన్నారు. భారతీయులు కష్టపడి పని చేయడం వల్లే ఈ ఘనత సాధ్యమైందని చెప్పారు. భారత్‌, కువైట్‌ దేశాలు అరేబియా సముద్రానికి ఇరువైపులా ఉన్నాయని.. ఈ రెండు దేశాలను కేవలం దౌత్యసంబంధాలే కలపడం లేదని.. హృదయ సంబంధాలు కూడా దగ్గర చేస్తున్నాయన్నారు. ఇప్పుడే కాదు.. గతంలోనూ రెండు దేశాల మధ్య సంబంధాలు బాగుండేవని వివరించారు.

 

 

Show comments