ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రభావం చమురు ధరలపై విపరీతంగా చూపిస్తోంది. ఫలితంగా పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా శ్రీలంకలో చమురు ధరలను పెంచుతున్నట్లు ఎల్‌ఐవోసీ ప్రకటించింది. ఈ మేరకు లీటర్ పెట్రోల్ ధర రూ.50, లీటర్ డీజిల్ ధర రూ.75 పెంచుతున్నట్లు తెలిపింది. ధరలను పెంచిన అనంతరం లీటర్ పెట్రోల్ ధర రూ.254కి చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.214కి చేరింది.
మరోవైపు శ్రీలంక రూపాయి భారీగా పతనమైంది. ఈ నేపథ్యంలో రేట్లు పెంచాల్సి వచ్చిందని ఎల్‌ఐవోసీ తెలిపింది. ప్రస్తుతం శ్రీలంక రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రూ.57కి తగ్గింది. శ్రీలంక రూపాయి పడిపోవడం గత వారం రోజుల్లో ఇది రెండో సారి. మరోవైపు నెలరోజుల వ్యవధిలో శ్రీలంకలో ఇంధన ధరలు పెరగడం ఇది మూడో సారి. శ్రీలంక సర్కారు చమురు ధరలపై ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదని.. తద్వారా అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో సంస్థ నష్టపోతోందని ఎల్‌ఐవోసీ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గుప్తా వివరణ ఇచ్చారు.
