NTV Telugu Site icon

Pervez Musharraf: కార్గిల్ యుద్ధ కారకుడు.. కరడుగట్టిన భారత వ్యతిరేకి.. పాక్ నియంత ముషారఫ్

Musharaf

Musharaf

Pervez Musharraf: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారప్(79) దీర్ఘకాలిక అనారోగ్యంతో దుబాయ్ లో ఆదివారం మరణించారు. కరుడుగట్టిన భారత వ్యతిరేకిగా ముద్రపడిని ముషారఫ్ అంచెలంచెలుగా ఎదిగి పాకిస్తాన్ నియంతగా మారాడు. తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకుని పాకిస్తాన్ ను సైన్యం కనుసన్నల్లో పాలించాడు. చివరకు స్వదేశంలో దేశద్రోహం నేరాలు ఎదుర్కోవడమే కాకుండా తనను వ్యతిరేకించి వారిని సైన్యం సహాయంతో అణిచివేశాడు. చివరకు తనకు మద్దతు ఇచ్చిన బెనజీర్ భుట్టో వంటి వారిని హతమార్చాడనే అభియోగాలు ఉన్నాయి.

ఢిల్లీలో జననం:

పాక్-ఇండియా విభజనకు ముందు 1943 ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించాడు పర్వేజ్ ముషారఫ్. దేశ విజభన సమయంలో అనేకమంది ముస్లింల లాగే ముషారఫ్ కుటుంబ కూడా పాకిస్తాన్ కు వెళ్లింది. లాహోర్ లోని ఫార్మన్ క్రిష్టియన్ కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. ఆ తరువాత లండన్ లోన రాయల్ కాలేజ్ ఆఫ్ ఢిఫెన్స్ స్టడీస్ చదివాడు. ఆ తరువాత 1961లో పాక్ మిలిటరీ అకాడమీలో శిక్షణ తీసుకుని, 1964లో పాక్ సైన్యం చేరాడు. 18 ఏళ్ల వయసులోనే పాక్ సైన్యంలో చేరాడు. 1965, 1971 భారత్ -పాక్ యుద్ధాల్లో పాల్గొన్నాడు. 1990లో మేజర్ జనరల్ గా పదోన్నతి పొందాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. పాక్ సైన్యాధ్యక్షుడిగా, పాక్ అధ్యక్షుడిగా పనిచేశాడు. ముషారఫ్ తండ్రి పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేశాడు, అతని తల్లి ఉపాధ్యాయురాలు.

కార్గిల్ యుద్ధానికి సూత్రధారి

1999 కార్గిల్ యుద్దానికి ప్రధాన కారణం పర్వేజ్ ముషారఫే. ఆయన ప్లానింగ్ ప్రకారమే పాక్ బలగాలు భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడి, కార్గిల్ సెక్టార్ లోని శిఖరాలను స్వాధీనం చేసుకున్నాయి. అయితే ఈ యుద్ధానికి ముందు 1989లోనే పాక్ ప్రధానిగా ఉన్న బెనజీర్ భుట్టోకు ఈ ఆక్రమణ గురించి తెలియజేశాడు. వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న కారణంగా చొరవతీసుకుని యుద్ధం గురించి వివరించాడు. అయితే భుట్టో యుద్ధ పరిణామాలతో భయపడి దీన్ని వెనక్కి తీసుకుంది.

అయినా కూడా ముషారఫ్ తగ్గలేదు. 1999 మార్చి-మే మధ్య కాలంలో పాక్ బలగాలను భారత్ లోకి చొప్పించి ఆపరేషన్ గ్రీన్ లైట్ పేరుతో దాడికి ప్రణాళిక రూపొందించాడు. ఇదంతా ప్రభుత్వానికి తెలియకుండానే తెరవెనకనుంచి అంతా నడిపించాడు. ఈ ఆక్రమణ సమయంలో భారత్ లో వాయిపేయి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ అధికారంలో ఉంది. అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో ఈ ఆక్రమణ గురించి ప్రధాని వాజ్ పేయ్ మాట్లాడితే, తనకు యుద్ధం గురించి తెలియదని నవాజ్ షరీఫ్ బదులు ఇచ్చారు. ఈ సమయలో నవాజ్ షరీఫ్, ముషారఫ్ ను తొలగించే ప్రయత్నం చేస్తే, ప్రధాని షరీఫ్ నే గద్దె దించి తాను దేశాధ్యక్షుడిగా 1999 అక్టోబర్ లో ప్రకటించుకున్నాడు. ముషారఫ్ ను సైన్యాధ్యక్షుడిగా చేసిన నవాజ్ షరీఫ్ అరెస్ట్ చేయించాడు.

ముషారఫ్ పై మూడుసార్లు హత్యాయత్నం

ముషారఫ్ తక్కువ సమయంలోనే అమెరికాకు మిత్రుడిగా మారాడు. 2001 నుంచి దేశాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాడు. 2007లో మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడయ్యాడు. అయితే ఈ గెలుపుపై సుప్రీంకోర్టులో పలుపార్టీలు పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే సుప్రీంకోర్టులో తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని గ్రహించి, ఉగ్రవాదాన్ని సాకుగా చూపి దేశంలో ఎమర్జెన్సీ విధించాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ ఎం చౌధురిని తొలగించి తనకు అనుకూలంగా ఉన్న జస్టిస్ అబ్దుల్ హమీద్ దోగార్ ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించాడు. ఈ తరువాత పరిస్థితి సద్దుమణిగింది.

అమెరికా మద్దతుతో పాక్ ఖైబర్ ఫఖ్తుంఖ్వా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆల్ ఖైదా, ఆఫ్ఘన్ తాలిబాన్లను నిర్మూలించేందుకు ప్రయత్నించాడు. సైన్యాన్ని ఉపయోగించి ఈ ఉగ్రసంస్థలను దాడులు చేశాడు. అయితే ఈ నేపథ్యంలోనే ముషారఫ్ ను ఉగ్రవాదులు మూడుసార్లు చంపేందుకు ప్రయత్నించాడు.

భారత్ తో చర్చలు..

1999లో భారత్ తో యుద్ధానికి కారకుడు అయిన ముషారఫ్, 2002లో భారత్ తో శాంతి చర్చలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కాశ్మీర్ అంశాన్ని చర్చలతో పరిష్కరించుకునేందుకు చొరవచూపాడు. ఆ సమయంలో భారత ప్రధానిగా ఉన్న అటల్ బిహారీ వాజ్ పేయి కూడా చర్చలకు మొగ్గు చూపారు. ముషారఫ్ హయాంలో, విదేశీ పెట్టుబడులు వృద్ధి చెందాయి, పాకిస్తాన్ వార్షిక ఆర్థిక వృద్ధిని 7.5 శాతంగా చూసింది. ఈ నేపథ్యంలో ఇండియా సాధారణ సంబంధాలను కోరుకున్నాడు.

మరణశిక్ష ఎదుర్కొని, ప్రవాసంలో జీవనం

2007లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన ముషారఫ్ అనేక అభియోగాలను ఎదుర్కొన్నారు. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య దగ్గర నుంచి లాల్ మసీదు అబ్దుల్ రషీద్ ఘాజీలను చంపించాడనే అభియోగాలు ఎదుర్కొన్నాడు. 2008లో పాకిస్తాన్ నుంచి యూకే పారిపోయాడు. 2013లో తిరిగివచ్చి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అయ్యాడు. పాక్ సుప్రీంకోర్టు ఇతడిని అనర్హుడిగా ప్రకటించింది. చివరకు అరెస్ట్ చేసింది పాక్ సర్కార్. అయితే 2016లో చికిత్స కోసం దుబాయ్ వెళ్లిన ముషారఫ్ అక్కడే కన్నుమూశాడు. 2007లో దేశద్రోహం కేసులో ముషారఫ్ కు 2019లో ఇస్లామాబాద్ కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ సమయంలో కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చి, మూడు రోజుల పాటు మృతదేహాన్ని వేలాడదీయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే మరుసటి ఏడాదే శిక్షను తగ్గించింది.

Show comments