Site icon NTV Telugu

Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో ఆకలి కేకలు..ఇప్పటికే 20 మంది మృతి..50 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్భణం

Pakistan

Pakistan

Pakistan Economic Crisis: తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో దాయాది దేశం పాకిస్తాన్ అల్లాడుతోంది. కనీసం అక్కడి ప్రభుత్వం ప్రజలకు తినేందుకు తిండిని కూడా ఇవ్వలేకపోతోంది. ఎక్కడ చూసిన ఆహారం కోసం తొక్కిసలాటలు, కొట్లాటలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ లోని బలూచిస్తాన్, పంజాబ్, సింధ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ఇలా అన్ని ప్రాంతాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇతర దేశాల నుంచి వచ్చే తిండి గింజలు ప్రజలకు చేరకముందే రాత్రికి రాత్రి మాయం అవుతున్నాయి.

Read Also: SRH vs RR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంపిక చేసుకున్న సన్‌రైజర్స్

పాకిస్తాన్ ద్రవ్యోల్భణం 50 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. మార్చిలో 35.37 శాతానికి చేరుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం నెలవారీ ద్రవ్యోల్భణం 3.72 శాతం కాగా.. గతేడాది సగటు ద్రవ్యోల్భణం రేటు 27.26 శాతంగా ఉంది. దీంతో పాకిస్తాన్ వ్యాప్తంగా నిత్యావసరాలు, పెట్రోల్, డిజిల్, గ్యాస్ ఇలా అన్నింటి రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. రాజకీయ అస్థిరత, ఉగ్రవాదం, సైన్యం పెత్తనం ఇలా సవాలక్ష సవాళ్లు పాకిస్తాన్ ముందు ఉన్నాయి. మరోవైపు ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ 1.1 బిలియన్లను విడుదల చేయకపోవడంతో పాకిస్తాన్ లో తిండికోసం అంతర్యుద్ధం చెలరేగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

22 కోట్ల జనాభా ఉన్న పాకిస్తాన్ లో రంజాన్ మాసంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కేంద్రాల వద్ద భారీ ఎత్తున ప్రజల క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. సరుకులు తీసుకునేందుకు భారీ ఎత్తున జనాలు రావడంతో తొక్కిసలాట జరుగుతోంది. గత 10 రోజుల్లో ఇలా తొక్కిసలాటల్లో 20 మంది ప్రజలు చనిపోయారు. శుక్రవారం కరాచీలో జరిగిన ఘర్షణల్లో 12 మంది మరణించారు. ముఖ్యంగా దిగుమతులపై ఆధారపడిన పాకిస్తాన్ వద్ద ప్రస్తుతం విదేశీమారక నిల్వలు అడుగంటాయి.

Exit mobile version