NTV Telugu Site icon

Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీపై కుట్ర.. విదేశీయుల కిడ్నాప్‌కు ఐసిస్ స్కెచ్!

Icc

Icc

పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీపై ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లుగా సమాచారం అందుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి హాజరవుతున్న విదేశీయులను కిడ్నాప్ చేయడానికి ‘కుట్ర’ జరుగుతుందని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెహ్రీక్-ఇ తాలిబన్ పాకిస్తాన్ (TTP), ఐఎస్ఐఎస్ (ISIS), బలూచిస్తాన్ ఆధారిత ఇతర గ్రూపులు సహా అనేక ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నినట్లుగా పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ పేర్కొన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. విదేశీ అతిథులే లక్ష్యంగా ఈ కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో సోమవారం భద్రతా దళాలను హెచ్చరించింది. యాక్టివ్ కోవర్ట్ గ్రూపులు కుట్రకు తెరతీశాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

“ఈ టోర్నమెంట్‌ను 2002లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీగా పేరు మార్చారు. 2009 వరకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవారు. తదనంతరం ఈ టోర్నమెంట్ నాలుగు సంవత్సరాలక మార్చబడింది. ఇక ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ఎనిమిది జట్లే ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటాయి.’’ అని ఐసీసీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇక 2008లో పాకిస్తాన్‌లో జరగాల్సిన షెడ్యూల్‌ను రద్దు చేసి దక్షిణాఫ్రికాలో నిర్వహించారు.

ప్రస్తుతం జరుగుతున్న ఈ టోర్నమెంట్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఇండియా.. పాకిస్థాన్ వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో భారత్ మ్యాచ్‌లను దుబాయ్‌కు మార్చారు. ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజాలు ఇంజమామ్-ఉల్-హక్, రమీజ్ రాజా, మిస్బా-ఉల్-హక్ మాట్లాడుతూ.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రాముఖ్యత గురించి వివరించారు. 2009లో జరిగిన దాడి పాకిస్తాన్ క్రికెట్ గమనాన్ని ఎలా మార్చిందో గుర్తు చేశారు. ఈ కారణంగా మాకు 10 సంవత్సరాలు శిక్ష పడిందని పేర్కొన్నారు.